కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు త్యాగయ్య. ఆయనను నిష్కామ త్యాగయోగిగా అభిర్ణించాలి. ఎందుకంటే, ఏ మాత్రం ఫలితాన్ని ఆశించక, తాను చేసిన ప్రతీ పనిని భగవదంకితం చేసిన ధన్యుడు కనుక. యావత్ భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వాగ్గేయకారులలో ఒకరాయన. నాదోపాసనతో దైవాన్ని దర్శించగలిగిన మహానుభావుడు. ఆయన కీర్తనలు శ్రీరామునిపై తనకుగల మహాభక్తి తత్పరతను గొప్పగా చాటుతాయి.
అవి ఇప్పటికీ జనం నోళ్లలో ఆనందతాండవం చేస్తున్నాయంటే వాటిలోని పారవశ్య స్థితి ఎంతటిదో అర్థమవుతున్నది. వేదాలు, ఉపనిషత్తులపై ఆయన అసాధారణ జ్ఞానాన్ని అవి తేటతెల్లం చేస్తాయి.
ఆయన కీర్తనలు ఎంత సరళమో అంత భక్తిమయం. సామాన్యులు సైతం ఆ సంగీత సాహిత్యాల ఆధ్యాత్మికతకు పులకించి పోవాల్సిందే. ఆయన వాగ్గేయ సృజనలోంచి ఉద్భవించిన వందలాది కీర్తనలలో ‘పంచరత్న’ (‘ఎందరో మహానుభావులు’, ‘జగదానంద కారక’, ‘దుడుకుగల’, ‘సాధించెనె’, ‘కనకనరుచిరా’) కీర్తనలు ఒక ఉదాహరణ మాత్రమే.
త్యాగరాజుల వారి జన్మస్థలం, పుట్టిన తేదీల గురించిన ప్రామాణిక సమాచారం అందుబాటులో లేదు. వారి శిష్య పరంపరల ద్వారా కొన్ని వివరాలు తెలియగా, ఆయన రాసిన కీర్తనల నుంచికూడా మరికొంత సమాచారం సేకరించారు. క్రీ.శ. 1767 మే 4న తమిళనాడులోని తంజావూరు జిల్లాకు దగ్గరలో ఉన్న తిరువారూర్ అనే గ్రామంలో ఒక సదాచార సంపన్నమైన బ్రాహ్మణ కుటుంబంలో త్యాగరాజు జన్మించారు.
కాకర్ల రామబ్రహ్మం సీతమ్మ దంపతులకు తాను మూడవ సంతానం. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల గ్రామం నుండి తంజావూరుకు వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం అప్పటి తంజావూరు ప్రభువు శరభోజీ ఆధ్వర్యంలో ఉండేవారు. త్యాగరాజు తాత గిరిరాజ కవి తెలుగు వాగ్గేయకారుడుగా ప్రసిద్ధులు కూడా.
బీజాంకురాలుగా భక్తి సంగీతాలు
త్యాగయ్య విద్యాభ్యాసం కోసమే రామబ్రహ్మం తిరువారూర్ నుంచి తిరువయ్యూరుకు వెళ్ళారు. తాను అక్కడ సంస్కృత విద్యను, వేదవేదాంగాలను అభ్యసించారు. శొంఠి వేంకట రమణయ్య దగ్గర సంగీతం అభ్యసించారు. ఆ గురువు త్యాగయ్య చాకచక్యాన్ని, సంగీత ప్రావీణ్యాలను గుర్తించి ఎంతో శ్రద్ధతో సంగీతోపదేశం చేశారు.
ఉపనయనం అయ్యాక తండ్రి బోధనలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం, రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలో బీజాంకురాలై ఆయనలో మూర్తీభవించాయి. అనతికాలంలోనే ప్రసిద్ధ కర్ణాటక సంగీత త్రయంలో (మరో ఇద్దరు: శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు) ఒకరిగా త్యాగరాజు వెలుగొందారు. తమిళనాడులో పుట్టి పెరిగినా తన గానం ఎక్కువగా తెలుగు, సంస్కృతాల్లోనే సాగడం విశేషం.
చిన్న వయస్సులోనే త్యాగయ్య తండ్రిని కోల్పోయారు. కులప్రతిమలుగా తనకు దక్కిన శ్రీరామలక్ష్మణుల విగ్రహాలను అతిభక్తితో ఆరాధించేవారు. ఈ దీక్ష, స్ఫూర్తితోనే ఇష్టదైవమైన శ్రీరామచంద్రునిపై అద్భుత కృతులు అసంఖ్యాకంగా వెలువరించారు. 18 ఏడ్ల వయసులో త్యాగరాజుకు పార్వతిని పెళ్లాడారు. కానీ, మరో అయిదేళ్లకే ఆమె మరణించడంతో సోదరి కమలాంబను పునర్వివాహం చేసుకున్నారు.
వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు, ఆమెద్వారా ఒక మనవడు కలిగారు. కానీ, ఆ బాలుడు యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. దీంతో త్యాగరాజుకు కచ్చితమైన వారసులెవరూ లేరనే చెప్పాలి. తాను ఏర్పరచిన సంగీత సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.
కర్ణాటక సంగీత గొప్ప స్వరకర్తలలో ఒకరిగా పేర్గాంచిన త్యాగరాజును సాహిత్యకారులు మన తెలుగు మహాకవి పోతనతో సమానంగా పోలుస్తారు. కారణం, ఆయన మాదిరిగానే దైనందిన, లౌకిక ప్రోత్సాహకాలను ఎన్నింటినో తిరస్కరించి, కేవలం శ్రీరాముని ఆరాధనలోనే ధన్యుడైనాడు కనుక. కడు పేదరికం అనుభవించినా సభక్తిత్వంతోకూడిన వ్యక్తిత్వాన్ని వీడలేదు.
అక్షరమక్షరంలో రామదర్శన తపన
ప్రస్తుత తమిళనాడులో పుట్టి పెరిగినా తెలుగుభాషలో గొప్ప ప్రావీణ్యుడుగా ప్రసిద్ధులైనారు. అద్భుతమైన కూర్పులతో సంగీత ప్రపంచంలో అద్వితీయమైన స్థానాన్ని సుస్థిర పరచుకున్నారు. తెలుగు, సంస్కృతాలలో ప్రావీణ్యం సంపాదించిన తర్వాత తంజావూరు ఆస్థానంలో ఒక ప్రముఖ ఆస్థాన విద్వాంసుడి ఆధ్వర్యంలో వీణ పాడటం, వాయించడం ప్రారంభించారు.
ఆయన ప్రతి రోజూ 1,25,000 సార్లు రామనామం జపించేవాడని, ఈ లెక్కన 38 సంవత్సరాల వయసు వచ్చేనాటికే 96 కోట్లు పూర్తి చేశారని చెప్తారు. త్యాగరాజు దాదాపు ప్రతి పాటలోనూ తనకు దర్శనం ఇవ్వమని లేదా తనను ఆశీర్వదించడానికి ఇంటికి రావాలని రాముడిని వేడుకోవడం వుంటుంది. త్యాగరాజు వాస్తవానికి ఎన్ని పాటలు (కృతులు) కూర్చారో ఎవరికీ తెలియదు.
ఆయన స్వరపరిచినట్లు చెబుతున్న 24,000 పాటలలో దాదాపు 700 పాటలు మిగిలి ఉన్నట్లు చెప్తారు. తెలుగులో రెండు సంగీత నాటకాలు, ‘ప్రహ్లాద భక్తి విజయం’, ‘నౌక చరితా’లనూ రచించారు.
త్యాగరాజు స్వరపరిచిన పాటలు ఎంత ఆకర్షణీయంగా, శ్రావ్యంగా ఉండేవంటే తిరువైయర్ వీధుల్లో ఆయన పాడుతున్నప్పుడు, సంగీతకారులతోపాటు సాధారణ ప్రజలు కూడా వాటిని వినడానికి గుమిగూడేవారు. ఆయన రచించిన పంచరత్నాలను కర్ణాటక సంగీతంలోని ‘ఐదు రత్నాలు’గా అభివర్ణిస్తారు.
ఐదవ పంచరత్నంలోని శ్రీ రాగానికి చెందిన ‘ఎందరో మహానుభావులు’ వంటివి బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వత కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటక సంగీతానికి మూలస్తంభంగా చెప్పాలి.
వారి జన్మదినం రోజుని ‘భారతీయ సంగీత దినోత్సవం’గా జరుపుతాం. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి ఏడాది పుష్య బహుళ పంచమి నాడు (18వ తేది) వారి ఆరాధనోత్సవాలు అత్యంత భక్తిపూర్వకంగా జరుపుకుంటాం.