calender_icon.png 17 March, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వశక్తితోనే మహిళలకు ఆత్మగౌరవం

17-03-2025 01:50:31 AM

  • డీజీపీ జితేందర్ వివక్ష లేని సమాజం మహిళల హక్కు
  •  రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు

ఎల్బీనగర్, మార్చి 16 : స్వశక్తితో ఆర్థికంగా జీవిస్తే మహిళలకు ఆత్మగౌరవం మరింత పెరుగుతుందని డీజీపీ జితేందర్ అన్నారు. వివక్ష లేని సమాజం మహిళల హక్కు అని, సమానత్వమే మనం వారికి ఇచ్చే గౌరవం అని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. రాచ కొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యంతో మహిళల కోసం ఆదివారం నాగోల్ లోని ఎస్వీఎం గార్‌అడెన్ లో మెగా జాబ్ మేళా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డిజిపి జితేందర్ హాజరై మాట్లాడారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి విధి అన్నారు. మహిళలు గృహిణిగా, తల్లిగా, ఉపాధ్యాయురాలిగా, స్నేహితురాలిగా, కూతురిలా ఇలా విభిన్న పాత్రలు పోషిస్తూ పురుషుడి విజయంలోనూ, అతడి సుఖఃసంతోషాలలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తారని తెలిపారు.

స్త్రీలు కేవలం ఇంటికి పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదివి, నైపుణ్యాలను, మేధస్సును ఉపయోగించుకొని అర్హతలకు తగిన విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. స్త్రీని గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని, స్త్రీని గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకోవడమేనన్నారు. మహిళలు స్వ శక్తితో జీవిస్తే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం మరింతగా పెరుగుతాయని తెలిపారు.

మహిళల కోసమే జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 2800 మంది మహిళలు హాజరుకాగా, 2323 మంది ఉద్యోగాలు పొందినట్లు పేర్కొన్నారు. ప్రతి రంగంలోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు.

కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, యాదాద్రి డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాసులు, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వ నాథ్, డీసీపీ రోడ్ సేఫ్టీ మనోహర్, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ జి.నర్సింహ రెడ్డి, డీసీపీ ఎస్‌ఓటీ రమణారెడ్డి, డీసీపీ శ్యామ్ సుందర్, డీసీపీ సైబర్ క్రైమ్స్ నాగలక్ష్మి, ఉమెన్స్ ఫోరం కార్యదర్శి డాక్టర్ రాధికానాథ్, శ్రీ సాయి సెక్యూరిటీ డైరెక్టర్, సైబర్ సెక్యూరిటీ ఫోరం, ట్రాఫిక్ ఫోరం శ్రీనివాస్, ఇన్ఫోసిస్, ఆర్.కె.ఎస్.సి చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రి, అధికారులు పాల్గొన్నారు.