“నేను దేహం మాత్రమే కాదు. నేను ‘ఆత్మస్వరూపుడిని’ అన్న భావన స్థిరపడిన స్థితిలోనే మనసు ఆత్మానుభవం కోసం తహతహలాడుతుంది. ఆ అనుభవం కోసం తన మార్గాన్ని తాను వెతుక్కునే ప్రయత్నం ప్రారంభిస్తుంది. అంటే ప్రాపంచిక, లౌకిక, భౌతిక భావనలను అధిగమించిన స్థితి ధ్యానమార్గం వైపు అడుగు వేస్తుంది. ఆ సాధన ప్రారంభమై ఒక స్థాయిని చేరుకున్నప్పుడు ‘నేను బ్రహ్మమునై ఉన్నాను’ అన్న సంస్థిత స్థితి ఏర్పడుతుంది.
ఆ స్థితిని దాటిన తర్వాత, మనసు ఏ వస్తువు మీదా ఆధార పడని వృత్తి కలుగుతుంది. ఈ ఆధార రహిత స్థితివల్ల స్వేచ్ఛ, శుభేచ్ఛ కలిగి సమన్వయ స్థితి ఏర్పడుతుంది. అంటే కోరికలు లేని, ఆశలు లేని కారణంగా మనసు నిర్మల నిశ్చల స్థితిని అందుకొని, ఈ స్థితిని మించిన దానికై నిరీక్షిస్తుంది.
ఇంతటి మహనీయ వృత్తులకే ‘ఆత్మవృత్తులు’ అని పేరు. ఈ మూడు స్థితులను అందుకున్న మనిషి తన మనసును ధ్యానం వైపు మరల్చుతాడు. ఇటువంటి ధ్యానమే పరమానందాన్ని అనుగ్రహించ గలదు. ఎన్నో రకాల ధ్యాన ప్రక్రియలు ఉన్నా అవి మనిషిని ఒకే గమ్యం వైపు నడిపిస్తయ్.
ధ్యానం అంటే ‘ధీయానం’! మనోప్రజ్ఞను దైవప్రజ్ఞ వైపు నడిపించేదని అర్థం. ధ్యానం మనిషిని సగుణం నుంచీ నిర్గుణం వైపు నడిపించి ఆనందాన్ని స్థిరం చేస్తుంది.
ధ్యానం అంటే ఏకాగ్రత! ఏకాగ్రతతో చేసే కర్మలన్నీ సంపూర్ణ ఫలితాలను ఇస్తయ్. బొమ్మను ఆధారం చేసుకుని, బ్రహ్మమును దర్శించటమే ధ్యాన పరమార్థం! చేసేది ధ్యానం కాదు, ఏమీ చేయక పోవటమే ధ్యానం. అంటే ఏ పనీ చెయ్యకుండా ఉండటం కాదు. అన్ని పనులను అర్థవంతంగా, సమర్థవంతంగా, నేర్పరితనంతో, ఓర్పుతో, కూర్పుతో చేయటమే ధ్యానం.
ధ్యానం అభ్యాసయోగం కాదు. అదొక దివ్య జీవన విధానం. పరిపూర్ణ ధ్యానం జీవిత విధానమైనపుడు, దేనికీ చలించని స్థైర్యం, గాంభీర్యం అలవడతాయ్. జీవితాన్ని సమగ్రంగా, స్పష్టంగా అనుభవించగల నిగ్రహం సహజ స్థితిగా మారి, జీవితం ఆనంద సంద్రమవుతుంది.
ఈ స్థితిలోనే స్థూల, సూక్ష్మ, కారణ శరీరావస్థలను దాటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వంటి వాటిని అధిగమించినప్పుడు మిగిలిన అనుభవం ఆత్మే!
ఆత్మానుభవాన్ని పొందగోరిన వ్యక్తి ఆశ్రయించ వలసిన ప్రధాన మార్గం ధ్యానమార్గం. ఇది రాజమార్గం. మనసును అరికట్టి, మాటలను కట్టిబెట్టి అంతరంగ శక్తులన్నింటినీ ఏకీకృతం చేసి, జీవితాన్ని, జీవనాన్ని క్రమశిక్షణతో దీక్షతో నడిపించగలగటమే నిజమైన ధ్యానం.
మనసును నిరంతరం ఖాళీ చేసుకుంటూ ఉండాలి.
వ్యర్థమైన ఆలోచనలకు తావీయక, చుట్టూ జరుగుతున్న సమస్త విషయాల పట్ల సాక్షీభూతంగా ఉండగలగటం వల్ల ఒక ప్రవృత్తిగా ఏర్పడి నివృత్తి మార్గం స్పష్టమవుతుంది. ఆ మార్గమే ఆత్మానుభవం వైపు నడిపిస్తుంది.
దృశ్యాలను అనుభవంలోకి తెచ్చే ధ్యానం అపరిపక్వమైంది. శూన్యత, పూర్ణత, సమగ్రత వంటి దివ్య భావనలన్నీ ఆత్మానుభవంలో ఇమిడి ఉన్న పార్శ్వాలే!
ధ్యానం ద్వారా ఆత్మానుభవాన్ని అందుకునే ప్రయత్నమే అసలైన అధ్యాత్మ సాధన!...”
పిప్పలాద మహర్షి మౌనం వహించారు! జిజ్ఞాసువుల మనసులూ మహాశూన్యాన్ని మానసికంగా అనుభవిస్తూ ఆత్మజాడలను, దాని ఉనికిని అనుభవ రససిద్ధం చేసుకునే దిశలో నిరీక్షిస్తున్నయ్...
- వి.యస్.ఆర్.మూర్తి