calender_icon.png 1 March, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయం ఉపాధికి ప్రాధాన్యం

01-03-2025 12:11:18 AM

  1. వివిధ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి
  2. రేపు వనపర్తిలో రూ.6వేలకోట్ల విలువైన పథకాలను సీఎం ప్రారంభిస్తారు
  3. బ్యాంకర్ల సమావేశంలో డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయంఉపాధి పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు. శుక్రవారం బేగంపేటలో బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. స్వయంఉపాధి పథకాలకు బ్యాంకర్లతో కలిసి సుమారు రూ.6వేల కోట్ల విలువైన ఉపాధి పథకాలను మార్చి 2న సీఎం రేవంత్‌రెడ్డి వనపర్తిలో ప్రారంభిస్తారని.. స్వయం ఉపాధి పథకాల పంపిణీ, సంక్షేమ పథకాలను ఓ పండుగలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇవి రాష్ర్ట జీడీపీని పెంచుతాయన్నారు. తెలంగాణ రైజింగ్‌లో బ్యాంకర్స్ పాత్ర కీలకమన్నారు. రైతు రుణమాఫీ కింద సుమారు రూ. 22 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని దీనిద్వారా రైతులతో పాటు బ్యాంకర్లకు మేలు జరిగిందన్నారు. 

రైతు భరోసా పథకం కింద  ఇప్పటికే రూ.11,500 కోట్లు, రైతు బీమా కింద రూ.1,500 కోట్లు, రైతులకు ఉచిత విద్యుత్ పథకం కింద సబ్సిడీ మొత్తం రూ.11వేల కోట్లు, సన్నధాన్యం బోనస్‌గా రూ.1,800కోట్లు రైతులకు ప్రయోజనం చేకూరిందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్టు తెలిపారు. వెయ్యి మెగావాట్లు ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నట్టు వివరించారు.  

మూసీ నిర్వాసితులకు బ్యాంకర్లు చేయూతనివ్వాలి..

హైదరాబాద్ నగరానికి సీఎం రేవంత్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని భట్టి చెప్పారు. నగరానికి మూసీనది మణిహారంగా తాము భావిస్తున్నామన్నారు. మూసీ పునరుజ్జీవంతో ఆదాయంతో పాటు, అక్కడి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూసీనది అభివృద్ధి క్రమంలో నిర్వాసితులు అయ్యేవారికి బ్యాంకర్లు ఆర్థికంగా చేయూతను అందించాలన్నారు. మూసీ నిర్వాసిత మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.