calender_icon.png 22 December, 2024 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆర్థిక స్వాలంబన, స్వయం ఉపాధి కోసం ఖాకె తైబా ట్రస్ట్ సేవలు అభినందనీయం

13-09-2024 07:49:24 PM

సాలేహ్ నగర్ లో ఖాకే తైబ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా టైలరింగ్ సెంటర్ ను ప్రారంభించిన మేయర్ సునీల్ రావు

కరీంనగర్,(విజయక్రాంతి): మహిళల ఆర్థిక స్వలంబన కోసం స్వయం ఉపాధి నిమిత్తం టైలరింగ్ సెంటర్లు దోహదపడతాయని,  మహిళలకు ఆర్థిక చేకూర్పు కోసం ఖాకే తైబ ట్రస్ట్ మిస్రీ గంజ్ హైదరాబాద్ వారు చేస్తున్న అనూపమాన కృషి, అవిశ్రాంత సేవలు అభినందనీయమని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. శుక్రవారం నగరంలోని 18వ డివిజన్ సాలెహ్ నగర్లో ఖాకే తైబ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్ నూతన భవన సముదాయాన్ని స్థానిక కార్పొరేటర్ సుదగోని మాధవి-కృష్ణ గౌడ్, ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, ట్రస్ట్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ సయ్యద్ అజ్మతుల్లా తో కలిసి  మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మానవత్వమే అభిమతంగా ఖాకే తైబ ట్రస్ట్ చేస్తున్న సేవలు చిరస్మరణీయమనీ కొనియాడారు. టైలరింగ్ సెంటర్ కోసం భూమిని విరాళంగా అందించిన షేఖాన్ వారసులు అబూ బకర్ ఖాలీద్, సాలం భాయిల సహకారం హర్షణీయమన్నారు. మానకొండూర్ లో పేద విద్యార్థుల కోసం జేఆర్ మోడల్ స్కూల్ పేరిట పేద పిల్లల కోసం స్కూల్ నెలకొల్పి, ఉచితంగా విద్య ను అందిస్తూ.. హాస్టల్ వసతి కల్పించడం వారి ఉదార మనస్తత్వానికి, సేవలకు నిదర్శనమన్నారు. కరీంనగర్ నగరంలో పలు చోట్ల ఖాకే తైబ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మహిళలకు పని కల్పించాలానే ఉద్దేశంతో టైలరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, టైలరింగ్ పని నేర్పించి, ఉపాధి కల్పించడం గొప్ప హర్షించదగ్గ పరిణామమన్నారు. కుల, మతలకతీతంగా ఖాకే తైబ ట్రస్ట్ మోడల్ టైలరింగ్ సెంటర్ లో వసతులు, సౌకర్యాలు చూస్తే సంతోషంగా ఉందన్నారు.

ఖాకే తైబ ట్రస్ట్ కు అండగా ఉంటామని, భవిష్యత్ లో సెంటర్ విస్తరణకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిధుల మంజూరు, తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ మాధవి, ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ విజ్ఞప్తి మేరకు మహిళలకు పీస్ వర్క్ కు ఐదు రూపాయలను పెంచిన మెటీరియల్ సప్లయర్ వీరేశంను అభినందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు, మహిళలు, మేయర్ సునీల్ రావుకు, కార్పొరేటర్లకు, ఎంఐఎం నగర అధ్యక్షుడికి శాలువాలు కప్పి ఆత్మీయంగా సన్మానం చేశారు. ఈకార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా, 18వ డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవి కృష్ణ గౌడ్, ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, కార్పొరేటర్లు ఎదుల్ల రాజశేఖర్, సయ్యద్ బర్కత్ అలీ, శర్ఫుద్దీన్, అలిబాబా, నక్క కృష్ణ, నాంపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ మైనార్టీ నేత సయ్యద్ మాజిద్, సెంటర్ ఇంచార్జి నజీబ్ అహ్మద్, స్థానికులు అహ్మద్, సాధిక్, అసిఫ్, ఫసి, ఇమ్రాన్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.