calender_icon.png 31 January, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణకు స్వీయ నియంత్రణ తప్పనిసరి

31-01-2025 08:55:55 PM

నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే పెరుగుతున్న ప్రమాదాలు..

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.. 

నిజామాబాద్ (విజయక్రాంతి): నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపును పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ శాఖ సౌజన్యంతో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ... ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అజాగ్రత్తగా, అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు.

వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం చేకూరుస్తున్నారని, ఎవరికివారు తమవంతు బాధ్యతగా భావిస్తూ ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని హితవు పలికారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనల గురించి ఏమాత్రం పట్టింపులేనితనం ప్రదర్శిస్తున్నారని, ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాదాల వల్ల ఎదుటివారికి కూడా తీరని నష్టం వాటిల్లుతోందని అన్నారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తుంచుకుని, తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. కుటుంబ సభ్యులందరూ విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా ప్రతి ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ చలానాలు విధించినా, ఎన్ని చట్టాలు వచ్చినా, ప్రభుత్వ యంత్రాంగం ఎంతటి కఠిన చర్యలు చేపట్టినా కూడా, ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రానంతవరకు రోడ్డు ప్రమాదాల పరిస్థితిలో మార్పురాదని అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం అనర్ధదాయకమని జాగ్రత్తలు సూచించారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ దిశగా ప్రభుత్వం కూడా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను జనవరి 01 నుండి 31 వరకు నెల రోజుల పాటు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ... మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ టేక్ చేయడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆటోలలో సామర్ధ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, రాంగ్ సైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ చేయడం తదితర కారణాల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ప్రమాదాల సంఖ్యా పెరిగేందుకు కారణమవుతోందని అన్నారు. అతివేగాన్ని మానుకోవాలని, రోడ్డు భద్రతా నిబంధనలను తుచ తప్పకుండా పాటిస్తూ ఎంతో అప్రమత్తతో వాహనాలు నడపాలని హితవు పలికారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్ ఏ.సీ.పీ నారాయణలు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే పరిస్థుతుల గురించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సదస్సులో ఎం.వీ.ఐ కిరణ్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.