కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆలం శైలజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఈనెల 16 నుండి 19 వరకు జరగనున్న జాతీయ స్థాయి జూనియర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటున్నట్టు గిరిజన క్రీడా అధికారి బండమీనారెడ్డి, క్రీడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంగు మంగళవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 19, 20న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జావీలిన్ త్రో లో అత్యంత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలలో బరిలో దిగనున్నట్లు తెలిపారు. అత్యున్నతమైన టెక్నిక్స్ తో శిక్షణ ఇస్తున్న అథ్లెటిక్ శిక్షకుడు విద్యాసాగర్ ని, ఆలం శైలజను ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్ రమాదేవి, ఏసీఎంవో పి. ఉద్ధవ్ ఏటీడీఓ చిరంజీవి, జి సి డి ఓ శకుంతల, పాఠశాల శిక్షకులు అరవింద్, తిరుమల్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.