ఇల్లెందు (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి సోమవారం వారు భూమి పూజ చేశారు. గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు మంజూరీ చేస్తామని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే కోరం కనకయ్య విమర్శించారు.
ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. పక్కా ప్రణాళికతో ఇళ్లును లబ్దిదారులు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. అపోహలకు గురి కావద్దని లబ్దిదారులకు విజ్ఞప్తి చేశారు. మోడల్ హౌస్ నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో తహసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో రవీందర్‌రావు, హౌసింగ్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ డేవిడ్, సీఐ తాటిపాముల సురేష్, కాంగ్రెస్ జిల్లా నాయకులు కోరం సురేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్యా దేవానాయక్, నాయకులు ఈది గణేష్, మోకాళ్ల పోషాలు, ఇస్లావత్ రెడ్యానాయక్, బండ్ల రజిని, మూడు సంజయ్, కాలె ప్రసాద్, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.