calender_icon.png 24 September, 2024 | 11:38 AM

త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

24-09-2024 01:32:29 AM

  1. 2 నుంచి అర్హులందరికీ రేషన్‌కార్డులు
  2. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి 

ఇల్లెందు, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను త్వరలో ప్రారంభిస్తామని, అర్హులందరికీ అక్టోబర్ 2 నుంచి రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు ఇస్తామని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం బొజ్జాయిగూడెంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన ఖమ్మం, మహబూబాబా ద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.

భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు ఎంత వరకు పూర్తి చేశారో తెలుసుకున్నారు. మంజూరైన పనులను తక్షణం మొదలుపెట్టాలని, మంజూరు కాకుంటే ప్రతిపాదనలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా సరఫరా చేయాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపునకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జాలను అడ్డుకోవాలని, ఆక్రమణదా రులు ఎవ్వరైనా కూడా ఉపేక్షించకుండా వారిపై తగు చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, టీజీఐ డీసైఈ చైర్మన్ మువ్వా విజయబాబు, కలెక్టర్లు అద్వైత్ కుమార్ సింగ్, జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.