calender_icon.png 3 October, 2024 | 4:42 PM

దర్జాగా కబ్జాలు

03-10-2024 01:28:56 AM

పరిగి మున్సిపాలిటీలో నాలాలు ఆక్రమించి వెంచర్ రోడ్ల నిర్మాణం 

ముడుపులకు ఆశపడి ఎన్‌వోసీలు ఇస్తున్న అధికారులు 

అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో రెచ్చిపోతున్న రియల్టర్లు

వికారాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి)/పరిగి: పరిగి మున్సిపాలిటీలో కబ్జాలు దర్జాగా సాగుతున్నాయి. చెరువు స్థలాలు, నాలాలు ఏవైతేనేం అన్నట్టుగా రియల్టర్లు కబ్జాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ వెంచర్లు చేయడం, అందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల ఆశీస్సులు మెండుగా ఉండడంతో రియల్టర్ల పంట పండుతోంది.

పరిగి పట్టణం మీదుగా 163వ నంబర్ జాతీయ రహదారి వెళ్లడంతో దినదినాభివృద్ధి చెందుతోంది. భూముల ధరలు కూడా పెరుగుతున్నాయి. రోజరోజుకూ విస్తరిస్తున్న పరిగి పట్టణంలో వెంచర్లు పుట్టగొ డుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతున్నాయి.

వెంచర్లకు అడ్డుగా ఉన్న నాలాలను సైతం లెక్కచేయకుండా కబ్జా చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా కాలనీలు ఏర్పాటు అవుతుండడంతో నాలాలు కనుమరుగవుతున్నాయి. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఇటీవల ఏర్పాటు చేసిన ఓ వెంచర్ నిర్వాహకులు అనేక చోట్ల నాలాలను కబ్జా చేసి రోడ్లు నిర్మించారు.  

నష్టపోయేది పేదలే

ప్రస్తుతం హైడ్రా హైదరాబాద్‌లో చేపడుతున్న కూల్చివేతల తరహాలోనే రానున్న రోజుల్లో ఇక్కడ కూడా కూల్చివేతలు చేపడితే ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు లక్షల్లో నష్టపోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్లాట్లు కొనుగోలు చేసే ముందు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్, నాలాల పూర్తి వివరాలు తెలుసుకొని ముందడుగు వేయాలని కొందరు అధికారులు సూచిస్తున్నారు.

పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఇటీవల ఏర్పాటు చేసిన ఓ వెంచర్ నిర్వాహకులు నాలాను పూర్తిగా కబ్జా చేసి రోడ్డు నిర్మాణాలు చేపట్టారు. ఈ వెంచర్‌లో స్థలాలు కొన్నవారు ఏకంగా నాలాలపై ఇంటి నిర్మాణాలు చేపట్టారు. నేషనల్ హైవేకు పక్కనే ఉన్న ఈ వెం చర్ నిర్వాహకులు రెండు వైపులా ఉన్న నాలాను కబ్జా చేశారు.

సుమా రు 10 మీటర్లు ఉండాల్సిన నాలా ఇప్పుడు కేవలం రెండు మీటర్లకు కుచించుకుపోయింది. సయ్యద్ మల్కాపూర్ నుంచి వచ్చే నాలా ఎర్రగడ్డపల్లి వాగులో కలుస్తుం ది. ఎర్రగడ్డపల్లి వాగు లఖ్నాపూర్ ప్రాజెక్టులో కలుస్తుంది. ఇలా వెళ్లాల్సిన నాలా మైత్రి వెంచర్‌లో కబ్జాకు గురైంది.

పక్కపక్కనే ఏర్పాటు చేసిన రెండు వెంచర్ల నిర్వాహకులు నాలాలను దర్జాగా కబ్జా చేశారు. తుంకుల్ గడ్డలోని రామరాజు కుంటా కబ్జాకు గురవగా, ఈ కుంటాకు సంబంధించిన వెనుకవైపు నాలా కనుమరుగై ఆ స్థలంలో వెంచర్ రోడ్డు వెలిసింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

డీటీసీపీ లే అవుట్ల పేరుతో.. 

డీటీసీసీ అనుమతులు ఉన్నాయంటూ రియల్టర్లు వెంచర్ పనుల ప్రారంభంలోనే రంగురంగుల బ్రో చర్లు చూపి ప్లాట్లు అమ్మేస్తున్నారు. వారు చేస్తున్న లే అవుట్లలో నాలాలు ఉన్నప్పటికీ అవేమీ లేవంటూ కొనుగోలుదారులను నమ్మించి ప్లాట్లు విక్రయి స్తున్నారు. వెంచర్ చేసే స్థలం లో నాలాలను మూసివేసి, వాటిపై ప్లాట్లు చేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటున్నారు.

నిబంధనల ప్ర కారం ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి నాలాలు, చెరువు స్థలం ఏదైనా ఉందా అనే విషయాన్ని పరిశీలించి ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రియల్టర్లు ఇచ్చే ముడుపులకు ఆశపడి నాలాలు ఉన్నా లేవన్నట్లుగా ఎన్‌వోసీలు ఇస్తున్నారు. అందుకు సంబంధిత అధికారు లపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

నాలాలు మూసివేసి ఏర్పాటు చేసిన వెంచర్లు ఎప్పటికైనా ప్రమాదమనే విషయాన్ని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు పడితే నీరు వెళ్లే దారిలేక ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు ప్రమాదాలు తప్పవని అంటున్నారు. ఇప్పటికే, ఈ కాలనీలు అంతా చెరువులను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఏకంగా ఇళ్లల్లోకి నీళ్లు పోతున్నాయి. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చే సమయంలో కూడా మున్సిపల్ అధికారులు కనీస నిబంధనలను పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.