calender_icon.png 8 February, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారులో తరలిస్తున్న 14.5 కిలోల గంజాయి పట్టివేత

07-02-2025 11:10:47 PM

లేడీ డాన్‌తో పాటు మరో ఇద్దరు అరెస్టు..

రూ. 8.50 లక్షల విలువైన గంజాయి, కారు స్వాధీనం..

ఎల్బీనగర్: పోలీసులకు చిక్కకుండా గంజాయి విక్రేతలు కొత్త ఎత్తులు వేస్తుండగా... ఎస్‌వోటీ పోలీసులు వారి ఆట కట్టిస్తున్నారు. పోలీసుల కన్నుకప్పడానికి గంజాయి ముఠా సభ్యులు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు కారులో వెళ్తున్నట్లు వెళ్తూ.. చేర్చాల్సిన చోటుకు గంజాయిని తరలిస్తున్నారు. ఇలాంటి తరహలోనే కారులో కుటుంబ సభ్యులతో కలిసి అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠాను ఎస్‌వోటీ పోలీసులు నిఘా పెట్టిన పట్టుకున్నారు. కారులో గంజాయిని అక్రమంగా రవాణా చేయడంతో ఆరితేరిన లేడీ డాన్ సునీతాదాస్ పోలీసులకు చిక్కారు. ఒడిశాలోని మాల్కాన్‌గిరి పరిధిలో జగల్‌దేవ్‌పూర్ నుంచి సునీతాదాస్ గంజాయిని కొనుగోలు చేసి.. హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

గంజాయిని కారులో ప్రత్యేకంగా అరలు చేయించి, చిన్న ప్యాకెట్ల రూపంలో సుమారు 14.5 కిలోల గంజాయిని తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ సీఐ నాగరాజు బృందం పోలీసులు శుక్రవారం హయత్‌నగర్ ఎక్సైజ్ పరిధిలో కారును అడ్డుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు లేడీ డాన్‌గా పేరుగాంచిన సునీతాదాస్, డ్రైవర్ ఇఫ్తియాఖురేషి, కంకన్‌సన అనే వ్యక్తి మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 14.5 కిలోల గంజాయితో పాటు కారు, సెల్‌ఫోన్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.3.50 లక్షలు, కారు విలువ రూ.లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గంజాయి ముఠాను పట్టుకున్న నాగరాజు టీమ్ సభ్యులతో పాటు మహిళా కానిస్టేబుల్ జ్యోతిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ తిరుపతియాదవ్ తదితరులు అభినందించారు.