ఐదుగురు నిందితుల అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): నగరంలో మరోసారి భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఏపీ(అరకు) నుంచి.. యూపీ, మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సైబరాబాద్ ఎస్‌ఓటీ డీసీపీ డి.శ్రీనివాస్, రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ సైబరాబాద్ కమిషనరేట్‌కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.
యూపీకి చెందిన ఠాకూర్ సచిన్ సింగ్ తన సహచరుడు వినోద్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఐదు సంవత్సరాలుగా ఏపీలోని అరకు ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్‌కు ఎండు గంజాయి సరఫరా చేస్తున్నాడు. నిందితులు రెండు కార్లు వినియోగిస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. ముందు ఒక పైలెట్ వాహనం వెళ్లి చెకింగ్ పాయింట్లు గమనించి సరకు ఉన్న వాహనానికి సమాచారం ఇస్తూ గంజాయి తరలించేవారని తెలిపారు. క్లియర్ రూట్లలో మాత్రమే గంజాయి ఉన్న కారు వెళ్తుందని, ఆ తరువాత కొంతదూరం వెళ్లాక గంజాయిని మరో కారులోకి మారుస్తుంటారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ ప్రాంతంలోని ఓఆర్‌ఆర్‌పై 254 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
అందులో యూపీకి వెళ్లే కారులో 154 కిలోలు, ముంబాయికి వెళ్లే మరో కారులో 100 కిలోల గంజాయిని మారుస్తుండగా ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో యూపీకి చెందిన ఠాకూర్ సచిన్ సింగ్(30), ప్రతాప్ సింగ్(22), ముంబాయికి చెందిన మహ్మద్ సలీమ్(24), మహ్మద్ నదీమ్(21), మహ్మద్ సక్లున్(24) ఉన్నారు. వారి నుంచి రూ. 1.04 కోట్ల విలువ చేసే 254 కిలోల ఎండు గంజాయి, 2 కార్లు, ఒక పిస్టోల్, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పరారీలో ఉన్న ముఠాలోని మరికొందరు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 140 కిలోలు
సంగారెడ్డి, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి)/జహీరాబాద్: ఒడిశా, ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రాల సరిహద్దుల నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటకకు ఎండు గంజాయిని తరలిస్తున్న నిందితులను పట్టుకున్నామని సంగారెడ్డి ఎస్పీ చెన్నూర్ రూపేష్ తెలిపారు. మంగళవారం జహీరాబాద్‌లోని చెరాగ్ పల్లి పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర సరిహద్దు చెరాగ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధి మాడ్గి చౌరస్తా సమీపంలోని 65వ నంబర్ జాతీ య రహదారిపై సోమవారం సాయంత్రం చెరాగ్‌పల్లి ఎస్సై రాజేందర్‌రెడ్డి, సీసీఎస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న బోలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనంలో రూ.35 లక్షల విలువ చేసే 140 కిలోల ఎండు గంజాయిని గుర్తించి, అందులో ఉన్న లఖిన్, సిద్దిరామ్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. సమావేశంలో జహీరా బాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, పట్టణ సీఐ శివలింగం, సీసీఎస్, ఎస్‌బీ సీఐలు మల్లేశం, విజయ్, రమేశ్ సిబ్బంది పాల్గొన్నారు.