calender_icon.png 20 January, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా మాదక ద్రవ్యాల స్వాధీనం

05-07-2024 12:13:51 AM

వేర్వేరు ఘటనల్లో రూ.73 లక్షల డ్రగ్స్, గంజాయి పట్టివేత 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): నగరంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో హైదరాబాద్ సిటీ (ఆసిఫ్‌నగర్, హబీబ్‌నగర్, కంచన్‌బాగ్) పోలీసులు హెచ్‌ఎన్యూ సిబ్బందితో కలిసి వేర్వేరు ఘటనల్లో 8 మంది నిందితులను అరెస్టు చేశారు.

ఒడిశాకు చెందిన మంజీత్ దాలి అలియాస్ జిత్తు, అనిల్ దానాజీ ఘంటే, సుశాంత్ మిస్త్రీ, సుమంత్ మండల్, ప్రసాన్‌జిత్ మిస్త్రీ, సంగారెడ్డికి చెందిన చిన్న రాథోడ్ గోవింద్, హైదరాబాద్‌కు చెందిన ఎస్ లఖన్ సింగ్ అలియాస్ లఖన్, దేవ్‌రాజ్ సింగ్‌లను అరెస్టు చేసి వారి నుంచి రూ. 61 లక్షల విలువైన 155 కిలోల గంజాయి, ఒక స్కార్పియో వాహనం, ఒక ప్యాసింజర్ ఆటో, 9 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గతంలోనూ గంజాయి సరఫరా, విక్రయాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారని, వారిలో నగరానికి చెందిన లఖన్ అనే వ్యక్తిపై పీడీ యాక్ట్, ఎన్డీపీఎస్ చట్టాల ప్రకారం కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను  కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. 

మరో ఘటనలో..

నాంపల్లి ప్రాంతంలో బైక్‌పై మాదక ద్రవ్యాలను తరలిస్తున్న నిందితులను సౌత్‌వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందాలు బేగంబజార్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. ఏపీకి చెందిన కొర్ర బాబు అలియాస్ డేవిడ్ (30), యద్నాపూడి ధన్‌రాజ్ (27), ఒడిశాకు చెందిన చందన్ కుమార్ చౌదరి అలియాస్ దినేష్ (34) అనే ముగ్గురి ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 8.65 లక్షల విలువైన 1.275 కిలోల హష్ ఆయిల్, ఒక ద్విచక్ర వాహనం, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు. 

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసుల తనిఖీల్లో..

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు బస్సులో అక్రమంగా తరలిస్తున్న రూ.3 లక్షల విలువైన 16.1 కిలోల గంజాయిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారుల కథనం ప్రకారం.. జయదేవ్ నెలూర్ అనే వ్యక్తి ఒడిశా నుంచి గంజాయిని తీసుకొని నగరంలోని దూల్‌పేటకు చెందిన అశోక్ సింగ్‌కు ఇవ్వడానికి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అతన్ని హయత్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఒడిశాకు చెందిన మిలన్‌దేవ్‌నాథ్ అనే వ్యక్తి హైదరాబాద్ కేంద్రంగా గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌టీఎఫ్ పోలీసులు తెలిపారు.