హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): ఆహార ఉత్పత్తుల పేరుతో విక్రయి స్తున్న నకిలీ ఔషధాలను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా చెంగిచెర్లల్లో ఫెరోరేడ్-ఎక్స్-టీ, ఫెరోజ్-ఎక్స్-టీ ట్యాబ్లెట్లను గురువారం స్వాధీనం చేసుకున్నారు.
ఆహార పదార్థాల పేరిట లైసెన్స్ తీసుకుని ఈ ఔషధాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. వీటిని తయారు చేసిన కంపెనీలు, విక్రయిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులపై కేసులు నమోదు చేసినట్లు డ్రగ్ కంట్రోల్ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న బొద్దుల సుధాకర్‌పై కేసు నమోదు చేసి యాంటీబయాటిక్స్, ఎనల్జసిక్స్ వంటి 76 రకాల ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఏవైనా అనుమానాలు ఉంటే టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయాలని సూచించారు.