- అధికారులకు మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు
- అపరిశుభ్రతపై దుకాణందారులు, అధికారులపై ఆగ్రహం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): అపరిశుభ్రత, కలుషితమైన, నాణ్యత లేని మాంసాహార పదార్థాల విక్రయాలు చేపడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే ఉపేక్షించేది లేదని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి హెచ్చరించారు. ఇసామియా బజార్, న్యూమోతీనగర్‌లో గల ఏపీసీ చికెన్ మార్కెట్‌ను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి మేయర్ శుక్రవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అక్కడ అపరిశుభ్రత, దుర్గంధంతో కూడిన దుర్వాసన వెదజల్లడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడాన్ని .. గమనించిన మేయర్ చికెన్ మార్కెట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చికెన్ మార్కెట్ దారుణమైన వాతావరణంలో నడుపుతున్నా.. తనిఖీలు చేయకుండా ఏం చేస్తున్నారంటూ మెడికల్ ఆఫీసర్‌ను మందలించారు. వెంటనే ఈ మార్కెట్‌ను సీజ్ చేయాలని జోనల్ కమిషనర్ రవికిరణ్‌ను ఆదేశించారు. కార్యక్రమం లో డిప్యూటీ కమిషనర్ మెడికల్ ఆఫీసర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.