calender_icon.png 25 February, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

550 కేజీల నకిలీ పత్తి విత్తనాలు సీజ్

17-02-2025 11:10:57 PM

నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు...

వికారాబాద్: 550 కేజీల నకిలీ పత్తి విత్తనాలను జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కె.నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని పెద్దెముల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఓ వ్యక్తి నిండు సంచులతో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో ఎలాంటి అనుమతులు లేని 150 కేజీల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. 2,70,000 ఉన్నట్లు తెలిపారు. 

పట్టుబడిన విత్తనాలకు ఎలాంటి అనుమతులు లేనట్లు పెద్దెములు వ్యవసాయ అధికారి ప్రీతం కూడా నిర్ధారించినట్లు తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలను సరపర చేస్తున్న ఉప్పలపాటి వసంత్ రావు ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా కోనంకి గ్రామంగా ఎస్పీ తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడు ప్రస్తుతం నివాసముంటున్న కర్ణాటక రాష్ట్రం, యాద్గిర్ జిల్లాకు వెళ్లి అతని నివాసంలో సోదాలు నిర్వహించగా రూ.7,20,000 లక్షల విలువ కలిగిన నాలుగు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు లభించినట్లు తెలిపారు. పెద్దమ్మ మండల కేంద్రంలో పట్టుబడిన 150 కేజీలు, అతని సొంత ఇంట్లో లభించిన 400లు, మొత్తం 550 కేజీల నకిలీ విత్తనాలను సీజ్ చేయగా వాటి విలువ మొత్తం రూ. 9,90,000 ఉన్నట్లు తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న వసంత్ రావుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులను ఎస్పీ అభినందించారు.