calender_icon.png 26 March, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పన్ను ఎగవేతదారుల ఆస్తులు సీజ్

22-03-2025 12:17:06 AM

10 రోజుల్లో రూ. 3 కోట్ల వసూలుకు చర్యలు 

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్

నల్లగొండ, మార్చి 21 (విజయక్రాంతి) : మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో  ఆస్తి పన్ను చెల్లించకుండా రెడ్ నోటీసులకూ స్పందించని ఎగవేతదారుల ఆస్తులను శుక్రవారం  సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మున్సిపల్ అధికారులు, పోలీసుల సమక్షంలో సీజ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో రూ. 10 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు రూ. 7 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. పెండింగ్ రూ. 3 కోట్ల వసూలుకు పదిరోజులే గడువు మాత్రమే ఉందని వెల్లడించారు.

దీంతో నోటీసులిచ్చినా స్పందించని  పట్టణ పరిధిలోని హెచ్పీ పెట్రోల్ బంక్, మదీనా కాంప్లెక్స్, యమహా షోరూంతోపాటు మొత్తం 10 ఆస్తులను సీజ్ చేయడంతోపాటు రూ. 14 లక్షలు వసూలు చేసినట్లు చెప్పారు. ఆస్తి పన్ను వసూలు లక్ష్యం పూర్తిచేస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశముందన్నారు. గతేడాది రూ. 9 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసినట్లు ఆయన వివరించారు. నోటీసులు అందుకున్న బకాయిదారులు తక్షణమే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో డీఏఓ శ్రీనివాస్ శర్మ, మున్సిపల్ కమిషనర్ యూసుఫ్,  ఎమ్మార్వో లు హరిబాబు, జవహర్ లాల్, సురేష్ కుమార్ ఉన్నారు.