ప్రకృతిని ఆరాధిస్తూ తమ పాడి పంటలు బాగుండాలి అంటూ ప్రకృతిలో ఉన్న ఏడుగురు దేవతలు హింగ్లాజ్, సీత్లా, మేరమ్మ, తులజ, ద్వళంగర్, మంత్రల్, దేవతలతో పాటు ఈ దేవతల తమ్ముడు అయిన లూక్డియా దేవుని ప్రతిష్టిస్తారు. ఆషాడ మాసంలో సీత్ల పండుగను ఘనంగా జరుపుకుంటారు. వానకాలంలో పశువులు వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతుంటాయి. అలా విలువైన పశుసంపద అంతరించిపోకుండా ఉండేందుకు గిరిజనులు ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గిరిజనుల ఆరాధ్య గురువు సేవాలాల్ మహరాజ్ హయాంలో సాథీ భవాని ఏడుగురు మాతల పేరిట తండా చివరలో అడవికి సమీపంలో అమ్మవార్లను నెలకొల్పి కొలవడం ప్రారంభించారు.
గ్రామ దేవతలైన పోచమ్మ, మైసమ్మ తదితరులకు పూజలు చేస్తున్నట్లే, గిరిజనులు ఏడుగురు అమ్మవార్లను పూజిస్తుంటారు. ఏడుగురు అక్కాచెల్లెల్లు. ఏడుగురు అమ్మవార్లలో చిన్నదైన సీత్ల దేవి పేరిట సీత్ల పండుగను జరుపుకుంటారు. గిరిజన లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలు కాస్త భిన్నంగా ఉంటా యి. వారి ఆచార వ్యవహారాలు ప్రత్యేకమని చెపొచ్చు. నిజమైన ప్రకృతి ప్రేమికులు బంజారాలు. అనాధిగా పశువులపై ఆధారపడి జీవనం సాగించే లంబాడీలు వాటి ఆరోగ్య రక్షణ పరమావధిగా ప్రత్యేక పూజా విధానాన్ని ఆచరిస్తున్నారు.
లంబాడీలు పూర్వం పశు సంపదను కలిగి ఉండేవారు. కాలక్రమేనా పశువుల కోసం గడ్డి ఉండే ప్రదేశాలను ఎంచుకుని అక్కడే నివాసం ఏర్పాటు చేసుకునే వారు. అలా తండాలు, గూడెలు ఏర్పడ్డాయి. ఖరీఫ్ పంటలకు ముందు జరుపుకునే పండుగే సీత్లా. ఈ పండుగ ఎంతో ప్రాము ఖ్యత కలిగి ఉంటుంది. సకాలంలో వర్షాలు కురిపించి పిల్లాపాప, పాడిపంటలు, పశు పక్షాదులు ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో ప్రతి గిరిజన తండాలో సీత్లా పండుగ చేసుకుంటారు. ఎక్కువగా జూలై మాసంలో ఈ ఉత్సవాన్ని ఏదో ఒక మంగళవారం భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.
చరిత్ర : పూర్వం బంజారాలు పశువులతో మమేకమై జీవనం సాగిస్తున్న క్రమంలో పశువులు వందల సంఖ్యలో గాలికుంటు వ్యాధి సోకి మృత్యువాత పడేవి. ఈ క్రమంలో ఒక బంజార కుల పెద్ద కలలో వారి ఏడుగురు దేవతలతో సీత్లా భవానీ ప్రత్యక్షమై నన్ను కొలిచినా, నా మొక్కు తీర్చినచో మీ సంపదను కాపాడుతానని వాగ్దానం చేసిందని చరిత్ర చెబుతుంది. ఈ క్రమంలో ఏడుగురు దేవతలను బంజా రాలు ప్రతి ఏటా పూజిస్తారు.
ప్రత్యేకత : గిరిజనులు ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించే సీత్లా భవాని దాటుడు పండుగ కోసం ఉద యాన్నే లేచి స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి తమ ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్‌కు ప్రత్యేక పూజలు చేస్తారు. తండావాసులు పశు సంపదను ప్రత్యేక అలంకరణ చేసి పూజా ప్రదేశానికి తీసుకువస్తారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక చెట్టు కింద ఏడుగురు దేవతామూర్తుల ప్రతిమలను ప్రతిష్టించి ఇంటికో ఉల్లిగడ్డ, రూపా యి బిల్ల, నవ ధాన్యాలు, కొబ్బరి కాయలు సమర్పిస్తారు. అక్కడే ప్రత్యేక పూజలు చేసి మేకలు, కోళ్లు బలి ఇస్తారు. బలి ఇచ్చిన మేకలు, కోళ్ల రక్తంతో తడిపిన నవధాన్యాలను పశువులపై చల్లుతారు. అనంతరం వాటి పేగులపై నుంచి పశువులను దాటిస్తారు. అనంతరం పిల్లాపాపలతో అటవీ ప్రాంతంలో వన భోజనా లు చేసి మహిళలు, పురుషులు నృత్యాలు చేస్తారు.
ప్రతిష్ట : ఈ పండుగను తండాకు తూర్పున అటవీ ప్రాంతం పొలిమేరల్లో జరుపుకుంటారు. ఏడుగురు దేవతా మూర్తుల ప్రతిమలను ప్రతిష్టిస్తారు. ఏడుగురు దేవతామూర్తుల్లో చిన్నదైన దేవతను మధ్య లో ప్రతిష్టించి ఇరువైపులా ముగ్గురి చొప్పున అక్కల ప్రతిమలను ప్రతిష్టిస్తారు. బంజారాల ప్రకృతి ఆరాధ్య దైవాలైన మేరమాయాడి, తుల్జాభవాని, మంత్రాళ్, కెంకాళీయాడీ, హింగ్లా, ద్వాళాంగర్, సీత్లాభవానీలను ప్రతిష్టిస్తారు. ఏడుగురు దేవతామూర్థులు హిందూ దేవతలైన సప్తమాత్రులకు బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వవాహీ, వారసింహా, ఇంద్రాలను పోలి ఉండటం విశేషం.
డాకు నాయక్, జయశంకర్ భూపాలపల్లి