calender_icon.png 18 October, 2024 | 5:03 AM

సీతక్కవి పొంతనలేని వ్యాఖ్యలు

18-10-2024 02:53:07 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పాలనలో  ఏటా ఇచ్చే బతుకమ్మ చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎందుకు నిలిపేసిందని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మంత్రి సీతక్క  పొంతన లేని వ్యాఖ్యలు చేయడం శోఛనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

గురువారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ తమ  ప్రభుత్వం ఏటా రూ.300 కోట్లతో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిందని ఒప్పుకున్నందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. అంతకు మించిన ప్రయోజ నాలను కాంగ్రెస్ సర్కార్ మహిళలకు కల్పించినట్లు భ్రమలు కల్పించే ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మహాలక్ష్మి అమ లు చేయకుండా మోసం చేయడమే కాకుండా రూ. 3,325 కోట్ల లెక్క చెప్పి, చెల్లించాల్సిన రూ. 23,250 కోట్లు కప్పిపుచ్చారని మండిపడ్డారు. కల్యాణ లక్ష్మి, తులం బంగారం ఏమైపోయాయని ప్రశ్నించారు.  మరో విషయమై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 23 నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలపై చర్చించి వెంటనే ప్రకటించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

ఈ ఏడాది మార్చి 31 తర్వాత పదవీ విరమణ పొందిన 5 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు త్వరలోనే బెనిఫిట్స్ అందజేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్ల విషయంలో ద్వంద్వ నీతి ప్రదర్శిస్తుందని హరీశ్‌రావు విమర్శించారు.

తెలంగాణ పత్తి రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని పత్తికి మద్దతు ధర వచ్చేలా చూడాలని కోరారు. గుజరాత్ పత్తికి క్వింటాల్‌కు రూ.8,257 చెల్లిస్తున్న కేంద్రం.. తెలంగాణ రైతులకు మాత్రం రూ.7,521 మాత్రమే చెల్లించడం దుర్మార్గమన్నారు.