హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న యువ అథ్లెట్ పాయమ్ కుమారిని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. నిరుపేద ఆదివాసీ కుటుంబంలో పుట్టి అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న పాయమ్ కుమారి బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీతక్కను మర్యాదపూర్వకం గా కలిశారు. ఈ సందర్భంగా పాయమ్ కుమారి ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్న మంత్రి.. తక్షణ సాయంగా లక్ష రూపాయాలు అందించాలని భద్రాచలం ఐటీడీఏ పీవోకు ఫోన్‌లో ఆదేశించారు.
లాంగ్ డిస్టాన్స్ రన్‌లో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన పాయమ్ కుమారి ప్రస్తుతం 200 మీటర్ల విభాగంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రొఫెసర్ కిషోర్ కుమార్, వెంకట రమణ, కుంజ శంకరరావు, పద్మజ, వెంకటలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.