25 May, 2026 | 4:25 AM

రాజ్యాంగమే రక్షణ కవచం

25-05-2026 12:42 AM

మతం పేరుతో ఓట్లు అడగడం బీజేపీ విధానం 

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): ‘రాజ్యాంగం దేశ ప్రజలకు కవచం లాంటిది. రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగం గురించి అదే చెప్తున్నారు’ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం అయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల కమిషన్ ద్వారా తొలిసారి ప్రధాని అయిన నెహ్రూ.. ప్రజలకు అవసరమైన వ్యవస్థలు సిద్ధం చేశారు. ఆ తర్వాత ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయకరణ చేశారు. ప్రతీ పేదకు భూమి, ఇల్లు ఇచ్చారు. రాజీవ్ గాంధీ ఐటీకి బీజం వేశారు.

యువతకు ఓటు హక్కు కల్పించారు. అప్పుడు బీజేపీ లేదు. మోదీ లేడు. అప్పటికే అభివృధి బీజం వేశారు. గాంధీ కుటుంబం పాలనలో సుపరిపాలన అందింది. 2014 లో మోదీ ప్రధాని అయ్యాక 2019లో ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని గెలిచారు’ అని జగ్గారె డ్డి ఆరోపించారు. ఓటు చోరీకి గురైంది అని రాహుల్ గాంధీ ప్రజల్ని అప్రమత్తం చేసే పనిలో ఉన్నారని, ప్రజలు తమకు నచ్చిన వారికి స్వేచ్ఛగా ఓటు వేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

బీజేపీ ఓట్లు దొంగతనం చేసి అధికారంలోకి వస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ మతం పేరుతో కొం త.. దొంగ ఓట్లతో కొంత గెలుస్తుందన్నారు. రాజ్యాంగం.. ఇచ్చిన స్వేచ్ఛను కొల్లగొడుతుందని దుయ్యబట్టారు. బీజేపీ అధికారం లోకి రాకముందు 54 లక్షల కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు 147 లక్షల కోట్లు అప్పు పెరిగిందన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం ఓట్ల కోసమో, అధికారం కోసమో పని చేయదని, దేశ ప్రజల సంక్షేమ ఆలోచనతోనే ఉం టారని పేర్కొన్నారు. దేశ ప్రజలకు మోదీ 11 ఏండ్లలో ఏం చేశారో చెప్పాలన్నారు.

ఓటు చోరీ, రాజ్యాంగం ఎత్తివేయాలనేదే వారి ఆ లోచన అని మండిపడ్డారు. రాహుల్ గాంధీని ఎన్నికల్లో ప్రధాని చేయాలని, తెలంగాణలో కాంగ్రెస్ 12 పార్లమెంట్ సీట్లు గెలవాలని కాంక్షించారు. ‘ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావద్దు అంటే... కాంగ్రెస్ కి 18 సీట్లు ఇవ్వండి. ప్రత్యేక హోదా... పోలవరం పూర్తి కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావా లి. చంద్రబాబు, జగన్ వల్ల అది సాధ్యమే కాదు. ఓట్లను ఖరాబ్ చేసుకోకండి. దేవుడు కూడా ఓటును సద్వినియోగం చేసుకోండి అనే చెప్తారు. 300 ఎంపీ సీట్లు కాంగ్రెస్‌కి ఇవ్వండి. దేశాన్ని, రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ కాపాడతారు’ అని జగ్గారెడ్డి అన్నారు.