calender_icon.png 23 September, 2024 | 11:57 AM

కశ్మీర్ ఎన్నికలను చూసి..

23-09-2024 02:18:32 AM

పాక్ కడుపు మండుతోంది..

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సరళిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశంసలు కురిపించారు. ఓటర్లు భారీ ఎత్తున పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం వర్ధిల్లడాన్ని చూసి పాకిస్థాన్‌కు కడుపు మండుతోందని వ్యాఖ్యానించారు. పూంచ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఆర్టికల్ 370ను మళ్లీ పునరుద్ధరిస్తామని చెబుతూ ఎన్సీ, కాంగ్రెస్, పీడీపీ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.

ఈ పార్టీలు పాకిస్థాన్‌కు వంతపాడుతున్నాయని, ఈ విధమైన దోరణిని మానుకోవాలని సూచించారు. తొలి విడత పోలింగ్‌లో 61 శాతానికిపైగా పోలింగ్ నమోదైందని, 30 ఏళ్లలో ఇదే గరిష్ఠమని రాజ్‌నాథ్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో 58 శాతం పోలింగ్ నమోదైందని గుర్తుచేశారు. జమ్ముకశ్మీర్ మంచి కోసమే 370 నిబంధనను రద్దు చేశామని, దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ సందేశం ప్రపంచానికి చేరిందని, ఇక్కడ ప్రజాస్వామ్య పతాకం ఎగరడం చూసి పాక్‌లో మంట మొదలైందని అన్నారు. అన్ని దేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని, పాక్‌తో శత్రుత్వాన్ని తాము కోరుకోవడం లేదని చెప్పారు.