రైతులకు బేడీలు వేయటం సిగ్గు చేటు
రేవంత్ రెడ్డి పాలనకి, KCR పాలనకి తేడా ఏమీ లేదు
మారింది పాలకులు మాత్రమే పాలన కాదు
KCR కి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుంది
దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమంలో బీజేపీ నాయకులు
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): లగచర్ల రైతులకు బేడీలు వేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు వద్ద శుక్రవారం సాయంత్రం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రవాదులను ఉద్యమకారులుగా, రైతులను ఉగ్రవాదులుగా చూడడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదనీ అన్నారు. లగచర్ల ఘటనలో అక్రమంగా అరెస్టయి జైల్లో ఉన్న గిరిజన రైతుకి గుండెనొప్పి రావడంతో, తనను ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు ఉగ్రవాదులకు వేసినట్టు బేడీలు వేసి తీసుకెళ్ళడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.
రైతులకు బేడీలు వేయటం సిగ్గు చేటు అని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనకి, KCR పాలనకి తేడా ఏమీ లేదనీ మారింది పాలకులు మాత్రమే పాలన కాదనీ ప్రజలకి అర్థం అవుతుందని అన్నారు. గత ఎన్నికల్లో KCR కి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందనీ జోస్యం చెప్పారు. కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తీవ్ర రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా నాయకులు రాజు పాటిల్, ప్రభాకర్, కాసర్ల రాజేందర్, లక్ష్మణ్, వినయ్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.