- జావెలిన్ త్రో తుది పోరుకు నీరజ్ చోప్రా
- తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి అర్హత
- గురువారం రాత్రి 11.55 గంటలకు ఫైనల్
పారిస్: భారత స్టార్ అథ్లెట్, డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్ పోటీల్లో నీరజ్ చోప్రా బరిసెను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. గత ఒలింపిక్ రికార్డును ఈసారి క్వాలిఫికేషన్‌లోనే బద్దలు కొట్టిన నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌కు అర్హత సాధించడం విశేషం. గ్రూప్ నీరజ్‌దే అగ్రస్థానం.
అతడితో పాటు తొలి ప్రయత్నంలోనే గ్రెనెడాకు చెందిన పీటర్స్ అండర్సన్ (88.63 మీ), రెండో స్థానంలో, పాకిస్థాన్‌కు చెందిన నదీమ్ అర్షద్ (86.59 మీ) మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. బ్రెజిల్ అథ్లెట్ డా సిల్వా లూయిజ్ మారిసియో మూడో ప్రయత్నంలో జావెలిన్‌ను 85.91 మీటర్లు విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. మల్దోవాకు చెందిన ఆండ్రియన్ మూడో ప్రయత్నంలో (84.13 మీ) తుది పోరుకు అర్హత సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించాలంటే అథ్లెట్లు బరిసెను 84 మీటర్లు దూరం విసరాలి. గురువారం రాత్రి 11.55 గంటలకు జావెలిన్ త్రో ఫైనల్ పోటీలు జరగనున్నాయి.
అదే వేగం.. అదే దూకుడు
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ పోటీలను తనతోనే మొదలుపెట్టాడు. క్వాలిఫయింగ్ రౌండ్ కాబట్టి టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌కు పసిడి తెచ్చిపెట్టిన 87.58 మీటర్ల దూరాన్ని దాటితే చాలు అనుకున్నాం. కానీ నీరజ్ ఒక ఉదుటున ముందుకు దూసుకొచ్చి ఎలాంటి తప్పు చేయకుండా సరైన దిశలో త్రో విసిరాడు. జావెలిన్ 89.34 మీటర్ల దూరంలో పడడంతో నీరజ్ తొలి ప్రయత్నంలోనే క్వాలిఫై అయ్యాడు.
దీంతో మరోసారి జావెలిన్‌ను త్రో చేయాల్సిన అవసరం కూడా రాలేదు. మరి ఫైనల్లో 90 మీటర్ల లక్ష్యం సాధిస్తాడా అనేది గురువారం తేలిపోనుంది. అయితే నీరజ్‌కు గ్రెనెడా జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ నుంచి ముప్పు పొంచి ఉంది. గతంలో పీటర్స్ 90 మీటర్లకు దూరాన్ని మూడు సార్లు విసిరాడు. పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ కూడా నీరజ్‌కు గట్టి పోటీయే.
కిషోర్‌కు నిరాశే..
భారత్ నుంచి బరిలోకి దిగిన మరో అథ్లెట్ కిషోర్ జెనా నిరాశపరిచాడు. జావెలిన్ త్రో పోటీల్లో భాగంగా గ్రూప్ నుంచి బరిలోకి దిగిన కిషోర్ జావెలిన్‌ను 80.73 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. రెండో ప్రయత్నంలో ఫౌల్ చేసిన జెనా మూడో ప్రయత్నంలో 80.21 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. ఇదే గ్రూప్ నుంచి జర్మనీ జావెలిన్ త్రోయర్ జులియన్ వెబెర్ 87.76 మీటర్లు విసిరి తొలి స్థానంలో నిలిచాడు. యెగో, జాకుబ్ రెండో, మూడో స్థానాల్లో నిలిచారు.