calender_icon.png 11 January, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాలో సాధువుపై దేశద్రోహం కేసు

06-11-2024 01:40:05 AM

మరో 17 మంది హిందువులపైనా కేసు నమోదు

బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని ఆవమానించారని ఆరోపణ

అక్రమ కేసులు ఎత్తేయాలని పుండరీక్ ధామ్ అధ్యక్షుడి డిమాండ్


ఢాకా, నవంబర్ 5: బంగ్లాదేశ్‌లో మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న నాయకత్వాన్ని అంతం చేయడానికే తమపై దేశద్రోహం కేసు నమోదు చేశారని పుండరీక్ ధామ్ అధ్యక్షుడు, సాధువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి పేర్కొన్నారు. ఇండియా టుడేకు తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనతోపాటు మరో 17 మంది హిందువులు దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఇందులో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.

తమపై పెట్టిన కేసును ఎత్తేయ డానికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సోమవారం వరకు సమయం ఇచ్చినట్టు చెప్పారు. డెడ్‌లైన్ లోపు కేసును ఉపసంహరించుకోకపోతే తదుపరి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటామన్నారు. బంగ్లాదేశ్‌లో మైనరిటీలపై జరుగుతు న్న దాడులను ఆయన ఖండించారు. ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ దాడులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1951లో బంగ్లాదే శ్‌లో హిందువుల జనాభా 22 శాతం ఉండగా ఇప్పుడు 8శాతం కంటే దిగువకు పడిపోయిందన్నారు.

షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత హిందువులపై జరిగే దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. మైనార్టీల రక్షణకు చట్టం చేయడంతోపాటు మైనార్టీ సంక్షేమం కోసం మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా.. గత నెల 25న హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా 8 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరుతూ భారీ ఎత్తున ప్రజలు ర్యాలీ తీశారు.

ఈ సందర్భంగా చిట్టగాంగ్‌లోని మార్కెట్ ప్రాంతంలో కొందరు కాషాయ జెండాలతో నిరసన తెలిపారు. అయితే కాషాయ జెండాలను అక్కడే ఉన్న బంగ్లాదేశ్ జాతీయ పతాకం కంటే ఎక్కువ ఎత్తుకు ఎగరేశారని ఆరోపిస్తూ బంగ్లా ప్రభుత్వం 18 మంది హిందువులపై దేశద్రోహం నమోదు చేసింది.