ఐటీ కంపెనీల్లో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం జోరుగా సాగుతున్నది. చట్టబద్ధమైన లైసెన్స్ లేకుండా లేదా కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ (రెగ్యులేషన్) యాక్ట్ 1970 కింద రిజిస్టర్ చేయకుండా వివిధ స్థాయిలలో కాంట్రాక్టుపై నియామకాలు జరుపుతున్నారు. వారికి కనీస ఉద్యోగ భద్రత లేదు. పని పరిస్థితులకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు లేదు. కంపెనీలు వారిని ఇష్టానుసారంగా మూకుమ్మడిగా తొలగిస్తున్నాయి. కోవిడ్- కాలం నుండి ఇది కొనసాగుతున్నది. తమ కలలకు తగ్గట్టు బ్యాంకుల నుండి రుణాలు పొంది వాయిదాలు కట్టలేక, కుటుంబ భారం మోయలేక అనేక అవస్థలు పడుతున్నారు.
దేశంలోని ఐటీ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖుడు ఇటీవల యువత వారానికి 70 గంటలు పని చేయాలని పిలుపునిచ్చారు. 12 గంటల పని దినాలు ఆనవాయితీగా ఉన్నాయి. రకరకాల ఒత్తిళ్ళు, నిద్రలేమి భరించలేక చాలామంది డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. తమ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని నిరాశగానూ ఉంటున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కౌన్సెలింగ్ ఇచ్చినా పూర్తిగా కోలుకోలేక పోతున్నారు. ఇండస్ట్రియల్ స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం నుండి వీరికి మినహాయింపు ఇవ్వడం వల్ల హక్కులను కోల్పోయే ప్రమాదముంది.
ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్