రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు
మేడ్చల్, జనవరి 18(విజయ క్రాంతి): అధికారులు బ్యాంకులలో భద్రతా చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచించారు. ఇటీవల రాయపర్తి, బీదర్, మంగళూరులో జరిగిన బ్యాంకు దోపిడీ ఘటనల నేపథ్యంలో బ్యాంకు అధికారులతో సిపి శనివారం సమావేశం నిర్వహించారు. పోలీసు శాఖ తరపున పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, బ్యాంకులు, ఏటీఎం లపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
బ్యాంకు ప్రాంగణంలో అవసరమైన చోట సీసీ కెమెరాలు అమర్చాలని, బ్యాంకు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, క్యాష్ కౌంటర్, స్ట్రాంగ్ రూమ్ లతోపాటు ముఖ్యమైన ప్రాంతాలు కవర్ కావాలన్నారు. రాయపర్తి, బీదర్, మంగళూరులో జరిగిన దోపిడీలు బ్యాంకుల భద్రత వైఫల్యాలను బయట పెట్టయన్నారు. పోలీసు శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా, గస్తీ తిరిగినా బ్యాంకులు భద్రతా చర్యలు తీసుకోకుంటే ఇలాంటివి పునరావృతం అవుతాయన్నారు.
ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 489 బ్యాంకు బ్రాంచీలను తమ అధికారులు సందర్శించి భద్రతా చర్యలను సమీక్షించారని ఆయన అన్నారు. శిథిల భవనాలు, లాకింగ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, అలారం, సెక్యూరిటీ గార్డులు, సింగిల్ బ్యాకప్ డేటా ఫుటేజ్ వంటి విభాగాలలో లోపాలను గుర్తించామని వీటిపై చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులకు కమిషనర్ సూచించారు.
ఈ సమావేశంలో యాదాద్రి డిసిపి రాజేష్ చంద్ర, ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్, మల్కాజ్గిరి డిసిపి పద్మజ, క్రైమ్ డిసిపి అరవింద్ బాబు, మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి, ఎస్ ఓ టి, డీసీపీలు రమణారెడ్డి, మురళీధర్, ఏసీపీలు నరేందర్ గౌడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.