calender_icon.png 27 September, 2024 | 10:51 PM

మీ పిల్లల ఆర్థిక భవిష్యత్‌కు భరోసా

22-09-2024 12:00:00 AM

 ఏడాదికి రూ.10 వేల పెట్టుబడితో రూ.10 కోట్ల నిధి

కొత్తగా ప్రారంభమైన ‘ఎన్‌పీఎస్ వాత్యల్య’ స్కీములో తల్లిదండ్రులు వారి పిల్లల ఆర్థిక భవిష్యత్ కోసం నెలసరి వాయిదాల్లో ఏడాదికి కనీసం రూ.1,000 మదుపు చేయవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. మీ కొడుకు/కుమార్తె చిన్నప్పటి నుంచి ఏడాదికి రూ. 10,000 చొప్పున 18 ఏండ్ల వయస్సు వచ్చేవరకూ ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీ పిల్లలు పెద్దవారై పదవీ విరమణ చేసే సమయానికి రూ.10 కోట్లకుపైగా నిధిని పొందే అవకాశం ఉంటుంది. 

తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కోసం నిర్దేశించిన పొదుపు పథకం ‘ఎన్‌పీఎస్ వాత్యల్య’ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆరంభించింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ స్కీమ్‌ను నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్)ను మైనర్ పిల్లలకు కూడా వర్తింపచేయడానికే ఎన్‌పీఎస్ వాత్యల్యను ప్రవేశపెట్టారు. గత పదేండ్లుగా అమలులో ఉన్న ఎన్‌పీఎస్‌లో ప్రస్తుతం 1.86 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఈ స్కీము నిర్వహణలో రూ.13 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. 

స్కీమ్ వివరాలు

తల్లిదండ్రులు/గార్టియన్లు మైనర్ పిల్లల పేరిట ఒక పెన్షన్ ఖాతాను తెరిచి అందులో పెట్టుబడి చేయడానికి ఈ స్కీమ్‌ను ఉద్దేశించారు. ఎన్‌పీఎస్ వాత్యల్య ఖాతాను 18 ఏండ్లలోపు వయస్సు వున్న పిల్లల పేరిట ప్రారంభించవచ్చు. 18 ఏండ్లు పూర్తయిన తర్వాత ఆ ఖాతా ఆటోమ్యాటిక్‌గా రెగ్యులర్ ఎన్‌పీఎస్ ఖాతాగా మారుతుంది. 60 ఏండ్లు వచ్చిన తర్వాత ఆ ఖాతా నుంచి పెన్షన్ అందుతుంది.  

 ఎన్‌పీఎస్ వ్యాత్యల్య ఖాతాను ఎవరు ప్రారంభించవచ్చు?

పద్దెనిమిది ఏండ్ల వయస్సులోపు ఉన్న మైనర్ బాలబాలికలందరూ ఎన్‌పీఎస్ వ్యాత్యల్య ప్లాన్ కింద ఖాతాను రిజిష్టర్ చేసుకోవడానికి అర్హులు. మైనర్ల పేరిటే ఈ ఖాతా మొదలువున్నందున, దాని ప్రయోజనాలన్నీ వారికే చెందుతాయి. అయితే పిల్లలు మేజర్లు అయ్యేంతవరకూ తల్లిదండ్రులు/గార్డియన్లు ఖాతాను నిర్వహించవచ్చు. 

 ఖాతా ఎక్కడ ఓపెన్ చేయాలి?

ఎన్‌పీఎస్ వాత్యల్య ఖాతాను  ప్రధాన బ్యాంక్‌లు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్స్ వద్ద ప్రారంభించవచ్చు. అలాగే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ)  వద్ద రిజిష్టర్ అయిన పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీలు) ద్వారా కూడా ఈ ఖాతాను తెరవవచ్చు.పీఎఫ్‌ఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో రిజిష్టర్డ్ పీవోపీల జాబితాను చూసి, 

మీకు దగ్గరలో ఉన్న పీవోపీని ఎంచుకోవచ్చు. 

 ఆన్‌లైన్ సదుపాయం

ఆన్‌లైన్‌లో కూడా ఎన్‌పీఎస్ వాత్యల్య స్కీమ్‌ను ఓపెన్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లోనే ఖాతాను నిర్వహించుకోవచ్చు. ఎన్‌పీఎస్ ట్రస్ట్‌కు చెందిన ఈఎన్‌పీఎస్ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ సదుపాయం లభిస్తుంది. ఈఎన్‌పీఎస్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను తెరిచి Protean లేదా KFintech ఏదైనా ఒక సీఆర్‌ఏ (సెంట్రల్ రికార్డ్‌కీపింగ్ ఏజెన్సీ)ను ఎంచుకుని ఖాతాను ఓపెన్ చేయవచ్చు.  ఖాతాకు వాయిదాల్ని ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు.  

ఖాతా సదుపాయాన్ని ప్రారంభించిన బ్యాంక్‌లు

ఎన్‌పీఎస్ వాత్యల్య స్కీమ్ కింద ఖాతాలను ఓపెన్ చేసే సదుపాయాన్ని ఇప్పటికే కొన్ని ప్రధాన బ్యాంక్‌లు ప్రారంభించాయి. ఇవి..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఎన్‌పీఎస్ వాత్యల్యను రిజిష్టర్ చేసుకునేందుకు ఖాతాదారులు వారికి సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్ బిజినెస్ సెంటర్‌ను సందర్శించాలంటూ ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఎస్బీఐ కూడా ఇందుకు సంబంధించిన ప్రకటనలు విడుదల చేసింది. మరింత సమాచారం sbipensionfunds.co.in లో లభ్యమవుతుంది. 

డబ్బు తీసుకునేదెలా?

కొన్ని బ్యాంక్ సైట్‌ల్లో పొందుపర్చిన వివరాల ప్రకారం ఖాతాను ప్రారంభించిన మూడేండ్ల లాక్‌ఇన్ పిరియడ్ తర్వాత అందులో ఉన్న మొత్తంలో విద్య, అనారోగ్యం తదితర అవసరాలకు 25 శాతం వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చు. మైనర్ ఖాతాదారుకు 18 ఏండ్ల వయస్సు వచ్చేవరకూ అటువంటి విత్‌డ్రాయిల్స్‌ను మూడు దఫాలు మాత్రమే అనుమతిస్తారు. 18 ఏండ్లు నిండిన తర్వాత ఈ స్కీమ్ నుంచి కావాలనుకుంటే వైదొలగవచ్చు. కానీ ఖాతాలో మొత్తం రూ.2.5 లక్షలకు మించిఉంటే అందులో 80 శాతం డబ్బుతో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయాలి. 20 శాతం నిధుల్ని తీసుకోవచ్చు. 18 ఏండ్లు దాటిన తర్వాత ఖాతాలో మొత్తం రూ.2.5 లక్షల లోపు ఉంటే దాన్నంతటినీ తీసుకోవచ్చు.మరణం సంభవిస్తే ఆ ఖాతాలో ఉన్న మొత్తాన్ని తల్లిదండ్రులు/గార్డియన్‌కు తిరిగి ఇచ్చివేస్తారు. 

కావాల్సిన పత్రాలు

  1. మైనర్ జననతేదీ రుజువు: బర్త్ సర్టిఫికెట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్, పాన్ కార్డు లేదా పాస్‌పోర్టు ద్వారా ఈ రుజువు సమర్పించవచ్చు.

తల్లిదండ్రులు/గార్డియల్ కేవైసీ: ఖాతా ను ప్రారంభిస్తున్నవారి తల్లిదండ్రులు లేదా గార్టియన్ వారి గుర్తింపు, చిరునామా రుజువుల్ని తెలిపే  కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాల్ని సమర్పించాలి. అధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, ఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్‌కార్డుల్లో ఏదైనా వర్తిస్తుంది. అలాగే గార్టియన్ పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) ఇవ్వాలి. గార్డియన్ నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్నారై) లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ అయినట్లయితే ఫారం 60 డిక్లరేషన్‌ను సమర్పించాలి.