calender_icon.png 22 October, 2024 | 5:09 PM

రాజ్యాంగంలో సెక్యులరిజం భాగమే

22-10-2024 02:56:27 AM

స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం 

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనేది భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 42వ సవరణ ద్వారా సెక్యులర్ (లౌకికవాదం), సోషలిస్ట్ (సామ్యవాదం) అనే పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామితో పాటు మరి కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికలో ఉన్న సోషలిస్ట్, సెక్యులర్ పదాలను 42వ  సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారని, వాటి కి భారతీయ కోణంలో విభిన్న అర్థాలు ఉన్నట్లు ధర్మాసనం తెలిపింది.

వాటిని పాశ్చాత్య దేశాల కోణంలో చూడకూడదని పేర్కొన్నది.  సామ్యవాదం అంటే సమానం అవకాశం ఇవ్వడమేనని, అలాగే సెక్యులర్ అన్న పదం కూడా భిన్నమైనదని తెలిపింది. తదుపరి విచారణను ధర్మాసనం నవంబ ర్18కి వాయిదా వేసింది.

కాగా పిటిషనర్ సబ్రమణ్యస్వామి తన వాదనలు వినిపిస్తూ రాజ్యాంగ పీఠిక రెండు భాగాలుగా ఉండవచ్చని, అంతమాత్రాన సెక్యులర్, సోషలిజం పదాలను చేర్చడానికి ప్రజలు అంగీకరించారని చెప్పడం సరికాదన్నారు. పీఠిక రెండు భాగాల్లో ఒకటి తేదీతో, మరొకటి తేదీ లేకుండా ఉంచవచ్చన్నారు. ఆధారాలు ఇస్తే పరిశీలిస్తామని సూచించారు.