calender_icon.png 29 October, 2024 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సచివాలయం చుట్టూ 144 సెక్షన్

29-10-2024 02:00:25 AM

  1. సెక్రటేరియట్ సిబ్బందిపై నిఘా
  2. సోషల్ మీడియాపైనా డేగ కన్ను
  3. రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకోండి 
  4. తప్పు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరిక 
  5. చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ ఆదేశాలు జారీ 

హైదారాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఏక్ పోలీస్- ఏక్ స్టేట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో వివిధ బెటాలియన్లకు చెందిన కానిస్టేబుల్స్ రెడ్డిక్కిన వేళ.. సచివాలయ సెక్యూరిటీ విభాగం అలర్ట్ అయ్యింది.

సస్పెండ్ చేసిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం పలువురు కానిస్టేబుల్స్ సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అలర్ట్ అయిన సెక్యూరిటీ విభాగం సచివాలయం చుట్టూ భారీగా పోలీసులను మొహరించింది. ఈ సందర్భంగా ఆందోళన చేసే కానిస్టేబుల్స్‌కు హెచ్చరిస్తూ.. సెక్రటేరియట్ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ అలర్ట్ జారీ చేశారు.

సోమవారం నుంచి సచివాలయం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. సచివాలయ పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉన్నా.. ధర్నాలు, రాస్తారోకోలు, సచివాలయ ముట్టడి లాంటి వాటిలో పాల్గొన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. 

సిబ్బందిపై ఫుల్ నిఘా

సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ సిబ్బందికి చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ కీలక సూచనలు చేశారు. సిబ్బందిపై నిఘా ఉంటుందని, ఇక్కడ విధులు నిర్వర్తించే వారు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెడుతున్నారు? అనే విషయాలను నిశితింగా పరిశీస్తారని.. సచివాలయంలో పని చేసే పోలీసులు, కానిస్టేబుల్స్ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు.

వాట్సాప్‌లో వద్దు

కానిస్టేబుల్స్‌లో చాలామంది వాట్సాప్ గ్రూప్స్‌లో అడ్మిన్‌గా ఉంటారని, మిగతా సిబ్బందిని గ్రూప్‌లో యాడ్ చేస్తూ టీజీఎస్పీ వ్యవస్థ గురించి, పోలీస్ ఆఫీసర్స్ గురించి రెచ్చగొట్టే విధంగా కొందరు పోస్టు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి కదలికపై నిఘా ఉంటుందని, అందరు తక్షణమే అటువంటి వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ కావాలి సూచించారు.

కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు కూడా అనుమతిలేని ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోల్లో పాల్గొనద్దని చెప్పారు. అలా చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోలీస్ ఆఫీసర్స్, ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా పోస్ట్లు పెట్టడం, షేర్ చేయడం చేయొద్దని హితవు పలికారు.