22-02-2025 02:25:59 PM
కాంగ్రెస్ లో కలవరం
దిద్దుబాటు చర్యలకు దిగిన అధిష్టానం..?
కాగజ్ నగర్,(విజయ క్రాంతి): అధికార కాంగ్రెస్ పార్టీకి సిర్పూర్ నియోజకవర్గంలో మాత్రం గడ్డుకాలం నడుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైనప్పటికి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పరిపాలన పెత్తనం అంతా అనధికారికంగా స్థానిక నాయకులకే అప్పగించింది అధిష్టానం. అధికార పార్టీ కావడంతో మిగితా పార్టీల నుండి చిన్నపెద్ద నేతలంతా వరుసకట్టి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసి గత ఎన్నికల్లో ఓటమి పాలైన కోనేరు కోనప్ప సైతం కాంగ్రెస్ గూటికి చేరారు.
పార్లమెంటు ఎన్నికల అనంతరం భారస నాయకుడు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రావి శ్రీనివాస్ గత రెండు దశాబ్దాలుగా తన మామ కోనేరు కోనప్పతో ఉన్న విబేధాలను పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేయడానికి చేతులు కలిపారు. ముగ్గురు బలమైన నాయకులు ఉండటంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఇక తిరుగు లేదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న తరుణంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి. మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లబించడం లేదని కినుకు వహించిన కోనప్ప గత కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటుండగా.. నియోజకవర్గ ఇంచార్జ్ రావి శ్రీనివాస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ల మద్య విభేధాలు పొడచూపాయి. తాజాగా పార్టీలో చేరిన ఎమ్మెల్సీకి అధిష్టానం అధిక ప్రాముఖ్యత ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేని రావి శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. వలస వచ్చిన నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారని రావి శ్రీనివాస్ వర్గీయులు బహిరంగానే విమర్శిస్తున్నారు.
తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీపిస్తుండటంతో నాయకులు తమదైన పంథాలో వెళ్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇన్నిరోజులు స్తబ్దుగా ఉన్న కోనప్ప ఒక్క సారిగా తన దిక్కార స్వరాన్ని వినిపించారు. తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తానని అవసరం అయితే రాబోయే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి ప్రజా సేవ చేస్తానని ప్రకటించారు. కాగజ్ నగర్ పట్టణంలో మంత్రి సీతక్క హాజరైన పట్టభధ్రుల ఆత్మీయ సమ్మేళనానికి సైతం నియోజకవర్గ రావి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప గైర్హాజరు అయ్యారు. కోనప్పకు, శ్రీనివాస్ కు సమాచారం ఇచ్చినా సభకు రాలేదని సభ నిర్వాహకులు అంటుండగా తమకు అసలు సమాచారమే ఇవ్వలేదని సదరు నాయకుల అనుచరులు అంటున్నారు.
ఒకవైపు స్వతంత్ర బావుటా ఎగురవేస్తూ మరోవైపు బిఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహించడం చూస్తుంటే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడడం దాదాపు ఖాయం అయినట్లే కనిపిస్తుంది. ఇంచార్జ్ మంత్రి సీతక్క సమావేశానికి రాకపోవడం, తమ నాయకునికి మంత్రి సమావేశం గురించి సమాచారం ఇవ్వలేదని రావి శ్రీనివాస్ వర్గీయులు సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా అద్యక్షుడు విశ్వప్రసాద్ లపై విమర్శలు చేయడం చూస్తుంటే నాయకుల మద్యలో విభేదాలు ముదిరి పాకన పడ్డట్టు కనిపిస్తున్నాయి. ఎన్నికల నేఫథ్యంలో పార్టీలో కుమ్ములాటలు తీవ్ర నష్టం కలిగించేలా ఉండటంతో పార్టీ హై కమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు సమాచారం.