calender_icon.png 27 December, 2024 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్టుగా గంజాయి సాగు

03-12-2024 12:57:20 AM

  1. మంగల్‌సింగ్  తండాలో గుర్తింపు
  2. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో దాడులు
  3. రూ.70 లక్షల విలువ చేసే మొక్కల ధ్వంసం

నిర్మల్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని తండాల్లో గంజాయి సాగు గుట్టును పోలీసులు రట్టు చేశారు. కడెం, దస్తురాబాద్ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో అడవుల మధ్య ఉన్న పల్లెలు, తండాల్లో కొందరు గంజాయి సాగు చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఎస్పీ జానకి షర్మిల, డీఎస్పీ గంగారెడ్డి, ఖానాపూర్, కడెం పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం వాగులు దాటి గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలకు వెళ్లారు.

మంగల్‌సింగ్ తండా లో ఇందల్, సజన్‌లాల్, గోతి రవీందర్, కదం సంతోష్, బామనే సురేందర్, ప్రతాప్‌సింగ్‌కు చెందిన పొలాల్లో పంటల మధ్యన గంజాయి మొక్కలను పెంచుతున్నట్టు గుర్తించారు. సుమారు రూ.70 లక్షల విలువ చేసే మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. మంగల్‌సింగ్ తండా దట్టమైన అడవి మధ్యలో ఉండడంతో రాకపోకలు అంతగా ఉండవు. ఇది ఆసరాగా భావించిన పలువురు గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

కొన్ని రోజులుగా ఈ ప్రాంతం నుంచే గంజాయి రవాణా అవుతున్నట్టు పోలీసులకు సమాచారం రావంతో వారు ప్రత్యేక దృష్టి సారించి దాడులు నిర్వహించారు. నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారంతా నేరాన్ని అంగీకరించడంతో వారిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు.