12-02-2025 12:00:00 AM
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సత్యం, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం
ముషీరాబాద్, ఫిబ్రవరి 11: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల 42 శాతం రిజర్వేషన్ ఎగవేతకు ప్రభుత్వం రహస్య ఎజెండా అమలు చేస్తున్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆరోపించారు.
డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం గోప్యత ఎందుకు పాటిస్తున్నదని ప్రశ్నించారు. మంగళవారం కాచిగూడలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ల కోసం ఏర్పాటైన భూసాని వెంకటేశ్వర్‌రావు డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను అత్యంత గోప్యంగా సోమవారం సీఎస్‌కు ఎందుకు అందజేశారో చెప్పాలన్నారకు.
నివేదికను అధికారికంగా ప్రకటించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. ప్రభుత్వం బీసీల పట్ల నిబద్ధత, నిజాయతీని నిరూపించుకోవడానికి రీ సర్వే చేయించాలని కోరారు. కులాల వారిగా జనాభాను ప్రకటించాలని అన్నారు. వారివెంట బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేశ్ ముదిరాజ్, నందగోపాల్, కోళా జనార్ధన్, సుధాకర్, ఉదయ్ నేత, సూర్యనారాయణ, హరి ఉన్నారు.