రాజ్‌గిర్ (బిహార్): స్వదేశంలో జరుగుతున్న మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో అమ్మాయిల జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. లీగ్ దశలో భాగంగా మంగళవారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 3-2 దక్షిణ కొరి యాపై థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ తరఫున దీపికా (ఆట 20వ, 57వ నిమిషంలో), సంగీతా కుమారి (3వ ని.లో) గోల్స్ సాధించారు. యూరి లీ (34వ ని.లో), ఉన్బీ చియోన్ (38వ ని.లో) దక్షిణ కొరియాకు గోల్స్ అందించారు. ఆట ప్రారంభమైన కాసేపటికే సంగీతా గోల్ కొట్టి భారత్‌కు శుభారంభం అందించింది.
ఆ తర్వాత రెండో క్వార్టర్స్‌లో దీపికా గోల్ కొట్టడంతో భారత్ 2-0 స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. అనంతరం మూడో క్వార్టర్‌లో ఫుంజుకున్న కొరియా రెండు గోల్స్ కొట్టి స్కోర్లను సమం చేసింది. సమయం గడుస్తోన్న కొద్దీ మ్యాచ్ ఉత్కంఠగా మారింది. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా పెనాల్టీ స్ట్రోక్‌ను దీపికా గోల్‌గా మలిచి భారత్‌కు విజయాన్ని అందించింది. కొరియాతో మ్యాచ్‌లో 11 పెనాల్టీ కార్నర్స్ వచ్చినప్పటికీ మూడింటిని మాత్రమే సద్విని యోగం చేసుకుంది. సలీమా టిటే బృందం తన తర్వాతి మ్యాచ్ గురువారం థాయ్‌లాండ్‌తో ఆడనుంది.