calender_icon.png 12 October, 2024 | 11:51 AM

అనిల్ అంబానీ పై సెబీ వేటు

24-08-2024 12:30:00 AM

  1. క్యాపిటల్ మార్కెట్ నుంచి ఐదేండ్లు నిషేధం
  2. 25 కోట్ల జరిమానా విధింపు
  3. మరో 24 సంస్థలు, వ్యక్తులను నిషేధించిన రెగ్యులేటర్
  4. రిలయన్స్ హోం ఫైనాన్స్ నుంచి నిధులు మళ్లించారంటూ ఆరోపణ

న్యూఢిల్లీ, ఆగస్టు 23: పారిశ్రామికవేత్త అనీల్ అంబానీని క్యాపిటల్ మార్కెట్ నుంచి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిషేధించింది. రూ.25 కోట్ల జరిమానాను సైతం విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్) నుంచి నిధులు మళ్లించారని ఆరోపిస్తూ అంబానీతో పాటు మరో 24 సంస్థలు, వ్యక్తులపై సెబీ వేటు వేసింది. అలాగే ఎటువంటి లిస్టెడ్ కంపెనీలోనూ, సెబీ రిజిష్టర్డ్ సంస్థలోనూ డైరెక్టర్‌గా లేదా కీలక నిర్వహణా హోదాలో ఐదేండ్లపాటు ఉండరాదని అనిల్‌ను సెబీ ఆదేశించింది. 24 సంస్థలు, వ్యక్తులకు సైతం రూ.21 కోట్ల నుంచి రూ. 27 కోట్ల జరిమానాను విధించింది. రిలయన్స్ హో ఫైనాన్స్‌ను కూడా సెబీ వదిలిపెట్టలేదు. ఈ కంపెనీని ఆరు నెలల పాటు సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధిస్తూ, రూ.6 లక్షల ఫైన్ వేసింది. 

ఏడీఏ గ్రూప్ చైర్మన్ హోదాను ఉపయోగించారు

ఏడీఏ గ్రూప్ చైర్మన్‌గా అనిల్ అంబానీ తన హోదాను, ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌లో తనకు ఉన్న పరోక్ష వాటాను ఉపయోగించుకుని మోసానికి పాల్పడ్డారని సెబీ ఆరోపించింది. ఈ మేరకు సెబీ 222 పేజీల ఉత్తర్వులు జారీచేసింది. ఎటువంటి ఆస్తులు, నికర విలువ, ఆదాయం లేని కంపెనీలకు వందల కోట్ల రుణాల్ని మంజూరు చేయడంపై ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ యాజమాన్యాన్ని, ప్రమోటర్‌ను సెబీ తప్పుపట్టింది. ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి రుణాలు పొందిన చాలావరకూ సంస్థలు ప్రమోటర్లకు చెందినవేనని సెబీ పేర్కొంది.

ఈ రుణగ్రహీతలు తిరిగి చెల్లించకపోవడంతో ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ తన సొంత రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యిందని, పబ్లిక్ షేర్‌హోల్డర్లు క్లిష్టమైన పరిస్థితుల్లో పడిపోయారని రెగ్యులేటర్ వివరించింది. ఉదాహరణకు 2018 మార్చిలో రూ.59.60 వద్దనున్న ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ షేరు ధర 2020 మార్చికల్లా 75 పైసలకు పడిపోయిందని సెబీ తెలిపింది. నిధుల మళ్లింపు మోసం స్పష్టంకావడమే ఈ పతనానికి కారణమన్నది. ఇప్పటికీ 9 లక్షల మంది పబ్లిక్ షేర్‌హోల్డర్లు ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌లో పెట్టుబడులు కొనసాగిస్తూ గణనీయమైన నష్టాలను ఎదుర్కొంటున్నారన్నది.

అంబానీ, ముగ్గురు ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ అధికారులను (బాప్నా, సుధాకర్, షా) సెక్యూరిటీల మార్కెట్ నుంచి ఐదేండ్లు నిషేధించడంతో పాటు లిస్టెడ్ కంపెనీల్లో డైరెక్టర్ లేదా కీలక నిర్వహణా అధికారులుగా ఉండరాదని ఆదేశించింది. బాప్నాకు రూ. 27 కోట్లు, సుధాకర్‌కు రూ.26 కోట్లు, షాకు రూ.21 కోట్ల ఫైన్ విధించింది. అలాగే మిగిలిన సంస్థలైన రిలయన్స్ యూనీకార్న్ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ ఎక్సేంజ్ నెక్ట్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ క్లీన్‌జెన్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్‌కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్, రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లు ఒక్కోదానికీ రూ. 25 చొప్పున జరిమానా వేసింది. ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి చట్ట విరుద్ధంగా మళ్లింపు జరగడానికి మధ్య సంస్థలుగా వ్యవహరించడం లేదా రుణాల్ని చట్టవిరుద్ధంగా పొందినందున వీటిపై జరిమానా విధించినట్టు సెబీ తెలిపింది. 

షేర్లు పతనం

సెబీ నిషేధం విధించిందన్న వార్తతో అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ షేరు 5 శాతంపైగా పతనమై రూ.4.45 వద్దకు పడిపోయింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు 10 శాతంపైగా పడిపోయి రూ.210 వద్ద నిలిచింది. రిలయన్స్ పవర్ 5 శాతం మేర తగ్గింది.

ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ నిధుల్ని సొంత సంస్థలకు రుణాలుగా మళ్లింపు

రిలయన్స్ హోం ఫైనాన్స్ నిధుల మళ్లింపు జరుగుతున్నదంటూ పలు ఫిర్యాదులు రావడంతో సెబీ 2018 నుంచి దర్యాప్తు చేసింది. ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు అమిత్ బాప్నా, రవీంద్ర సుధాకర్, పింకేశ్ ఆర్ షాల సాయంతో ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి నిధుల్ని  అనిల్ అంబానీ తనకు సంబంధించిన సంస్థలకు రుణాలుగా మళ్లించారని తమ దర్యాప్తులో కనుగొన్నట్టు సెబీ తెలిపింది. అటువంటి రుణ మంజూరీ కార్యకలాపాలను నిలిపివేయాలంటూ ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ డైరెక్టర్ల బోర్డు గట్టి ఆదేశాలు జారీచేసి, కార్పొరేట్ రుణాల్ని క్రమేపీ సమీక్షిస్తున్నా, కంపెనీ యాజమాన్యం ఆ ఉత్తర్వులను పట్టించుకోలేదని సెబీ ఆరోపించింది.

అనిల్ అంబానీ ప్రభావంతో కొంతమంది కీలక కంపెనీ అధికారులు కార్పొరేట్ పాలనా వైఫల్యానికి పాల్పడ్డారన్నది. ఈ పరిణామాల కారణంగా మోసానికి పాల్పడిన వ్యక్తులతో ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ కంపెనీకి కూడా మోసంలో సమానభాగం ఉన్న ట్టుగా పరిగణిస్తున్నట్టు మార్కెట్ రెగ్యులేటర్ తెలిపింది. మిగిలిన సంస్థలు, వ్యక్తులు ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి చట్టవిరుద్ధంగా నిధుల్ని అందుకున్నాయని లేదా మళ్లించడానికి వీలు కల్పించాయని సెబీ పేర్కొంది.