calender_icon.png 10 October, 2024 | 3:54 PM

పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మకు సెబీ నోటీసులు!

27-08-2024 12:00:00 AM

 ముంబయి: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు ఇవాళ భారీగా కుంగాయి. కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ  షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. దీంతో సోమవారం పేటీఎం షేరు ఓ దశలో బీఎస్‌ఈలో 8.88 శాతం క్షీణించి 505.25కు చేరడం గమనార్హం. తర్వాత కాస్త కోలుకుని 4.48శాతం నష్టంతో రూ.530 వద్ద ముగిసింది.2021లో పేటీఎం ఐపీఓకు వచ్చిన సంగతి తెలిసిందే.

పబ్లిక్ ఇష్యూకు సంబంధించి ప్రమోటర్ క్లాసిఫికేషన్ నిబంధనలు పాటించలేదంటూ ఆర్‌బీఐ ఇచ్చిన ఇన్‌పుట్స్ మేరకు సెబీ విజయ్ శేఖర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ’మనీకంట్రోల్’ పేర్కొంది. అంతేకాదు మాజీ బోర్డు మెంబర్లకు కూడా ఈ నోటీసులు జారీ అయినట్లు తెలిసింది. ఈ ఏడాది పేటీఎం పేమెంట్స్ బ్యా్ంప చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

F2021లో పేటీఎం ఇష్యూ ధర రూ.2150 కాగా.. 9 శాతం డిస్కౌంట్‌తో రూ.1995 వద్ద షేర్లు లిస్టయ్యాయి. దీంతో ఆరంభంలోనే నిరాశ పరిచింది. మదుపర్లకు నష్టాలను మిగిలిచ్చింది. తర్వాత ఏనాడూ ఆ స్థాయికి చేరింది లేదు. పైగా పేటీఎం పేమెంట్స్ బ్యాక్‌పై ఆర్‌బీఐ చర్యల నేపథ్యంలో ఈ ఏడాది షేరు ధర రూ.310 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ తాజా షాక్ తగలడం గమనార్హం.

Fవిజయ్ శేఖర్ శర్మ ప్రమోటరా, ఉద్యోగా అన్న దానిపై ప్రస్తుత వివాదం నెలకొంది. ఐపీఓ పేపర్లలో విజయ్ శేఖర్ శర్మను లార్జ్ షేర్ హోల్డర్ అని పేర్కొన్నారు. సెబీ నిబంధనల ప్రకారం.. ప్రమోటర్లు ఐపీఓ తర్వాత ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు అందుకోవడంపై నిషేధం. కానీ, 2021 నాటికి విజయ్ శేఖర్ శర్మకు 14.7 శాతం వాటా ఉండేది. ఐపీఓకు ముందు తన ఫ్యామిలీ ట్రస్టయిన యాక్సిస్ ట్రస్టీ సర్వీసెస్‌కు 30.97 మిలియన్ల షేర్లను బదలాయించడం ద్వారా తన వాటాను 9.1 శాతానికి తగ్గించుకున్నారు.

తద్వారా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అందుకోవడానికి అర్హత సా ధించారు. వాస్తవానికి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలో 10 శాతానికి మించి వాటా ఉంటే వీటిని అందుకోవడం కుదరదు. అయితే, 2023లో మళ్లీ విజయ్ శేఖర్ శర్మ 10.3 శాతం వాటాను పొందారు. ఈ నేపథ్యంలో ప్రమోటరా, ఉద్యోగా అన్న దానిపై సెబీ నిగ్గు తేల్చనుంది. విజయ్ శేఖర్ శర్మపై వచ్చిన వార్తల నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇవ్వాలని ఎక్స్‌చేంజీలు సైతం వివరణ కోరినట్లు తెలుస్తోంది.

స్పందించిన పేటీఎం

సెబీ షోకాజు నోటీసుల వార్తలపై పేటీఎం స్పందించింది. ఇదేం కొత్త విషయం కాదని, మార్చి 31, జూన్ 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా స్టాక్ ఆప్షన్ వివరాలు వెల్లడించామని పేర్కొంది. సెబీకి కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని తెలిపింది. నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని, తమ 2024 ఆర్థిక ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.