calender_icon.png 1 November, 2024 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓలా ఎలక్ట్రిక్ ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్

21-06-2024 12:10:00 AM

రూ.5,500 కోట్ల సమీకరణకు ప్రతిపాదన

ముంబై, జూన్ 20: ఓలా ఎలక్ట్రిక్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతి ఇచ్చింది. రూ. 5,500 కోట్లు ఐపీవో ద్వారా సమీకరించేందుకు గత ఏడాది డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సెబీకి సమర్పించింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఐపీవో జారీచేస్తున్న తొలి స్టార్టప్‌గా ఓలా ఎలక్ట్రిక్ నిలుస్తుంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌లో ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ పర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో 9.52 కోట్ల షేర్లను ఐపీవోలో విక్రయించనుండగా, మరికొన్ని ఈక్విటీ షేర్లను కంపెనీ తాజాగా జారీచేస్తుంది. ఎస్1 ప్రొ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో ద్వారా 6 బిలియన్ డాలర్ల వాల్యూయేషన్‌ను ఆశిస్తున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఓలా ఎలక్ట్రిక్ అనుబంధ సంస్థ ఓలా క్యాబ్స్ సైతం ఐపీవో ద్వారా 500 మిలియన్ డాలర్లు సమీకరించాలని చూస్తున్నది.

4.7 కోట్ల షేర్లను విక్రయిస్తున్న ప్రమోటర్

ఓలా ఎలక్ట్రిక్ సెబీకి సమర్పించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన భవిశ్ అగర్వాల్ 4.74 కోట్ల షేర్లను (కంపెనీలో 1.3 శాతం వాటా) విక్రయించనున్నారు. ఐపీవోలో కంపెనీకి 6 బిలియన్ డాలర్ల విలువ లభిస్తే 78 మిలియన్ డాలర్ల వరకూ (రూ.650 కోట్లు) అగర్వాల్ సొమ్ముచేసుకుంటారు. ఓలా ఎలక్ట్రిక్‌లో ప్రస్తుతం పెట్టుబడులు ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2.38 కోట్ల షేర్లను, టైగర్ గ్లోబల్ ఫండ్ 64 లక్షల షేర్లను, అల్ఫావేవ్ 38 లక్షల షేర్లను, మ్యాట్రిక్స్ పార్టనర్స్ 37 లక్షల షేర్లను, టెమాసెక్ 13 లక్షల షేర్లను ఓఎఫ్‌ఎస్ రూట్లో విక్రయిస్తాయి. తాజా ఈక్విటీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.1,226 కోట్లు కంపెనీ బ్యాటరీ సెల్ ఉత్పత్తి ప్లాంటు సామర్థ్యాన్ని విస్తరించనున్నట్టు ప్రాస్పెక్టస్‌లో తెలిపింది.