calender_icon.png 9 October, 2024 | 2:56 AM

ఎన్‌ఎస్‌డీఎల్ ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్

09-10-2024 12:52:59 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: డిపాజిటరీ సంస్థ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డీఎల్) తొలి పబ్లిక్ ఇష్యూ జారీచేసేందుకు మార్కెట్ రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది. ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతిపాదిత ఎన్‌ఎస్‌డీఎల్ ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో ప్రస్తుత షేర్‌హోల్డర్లు ఎన్‌ఎస్‌ఈ, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 5.72 కోట్ల షేర్లను విక్రయిస్తాయి. ఐడీబీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సైతం వాటివద్దనున్న షేర్లను ఎన్‌ఎస్‌డీఎల్ ఐపీవోలో ఆఫ్‌లోడ్ చేస్తాయి. ఎన్‌ఎస్‌డీఎల్ ఎటువంటి తాజా ఈక్విటీ షేర్లనూ జారీచేయదు. 

స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ ఆఫర్

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో ప్రతిపాదనకు కూడా సెబీ ఆమోదముద్ర వేసింది. ఈ కంపెనీ రూ.600 కోట్ల సమీకరణకు పబ్లిక్ ఆఫర్ ప్రతిపాదించింది. రూ.250 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఆఫర్లో జారీచేస్తుంది. మరో రూ.350 కోట్ల విలువైన 1.84 కోట్ల షేర్లను ప్రస్తుత షేర్‌హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయిస్తారు. ఈ కంపెనీ ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాల కోసం స్పెషల్ ఇంజనీరింగ్ ఎక్విప్‌మెంట్‌ను తయారు చేస్తుంది.