కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తాం
రేవంత్‌వి చిల్లర రాజకీయాలు
ప్రజా సమస్యలపై పట్టింపే లేదు
ఫోన్ ట్యాపింగ్ ఓ రాజకీయ డ్రామా
ట్యాపింగ్‌తో నాకు సంబంధంలేదు
కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు
బీజేపీ ఏజెండాలో పేదల ప్రస్తావనే లేదు
ఢిల్లీ లిక్కర్ స్కాంతో మోదీ కక్ష సాధింపులు
మీడియా సమావేశం బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను కనీసం ౧౨ సీట్లలో గెలిపిస్తే కేంద్రంలో, రాష్ట్రంలో తమ తడాఖా చూపిస్తామని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. బీజేపీకి ౨౦౦ సీట్లకు మించి రావని, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషించబోతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కార్ చిల్లర రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. పనికిరాని రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ఎత్తులు వేస్తుందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రేవంత్ ప్రభుత్వం ఆడుతున్న ఆట అని.. దానితో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఫోన్ ట్యాపింగ్‌ను పోలీసు అధికారులు చూసుకుంటారని, అంతర్గత రక్షణలో భాగంగా వారి విధులు నిర్వహించారని తెలిపారు. ఆ అంశాన్ని తనపై రుద్ది రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
రైతులు, చేనేత, గొల్లకురుమల పథకాల నిధులివ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ప్రజలంతా ఆ పార్టీపై ఆగ్రహంతో ఊగిపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పదేళ్ల తరువాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ దిక్కుమాలిన పనులు చేస్తున్నదని మండిపడ్డారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి రాష్ట్రం దివాళా తీసిందని చెప్పడం విడ్డూరంగా ఉందని, తెలంగాణ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేలా ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం వ్యాఖ్యలు రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు.
తాత్కాలికంగా వారికి రాక్షసానందం కలుగొచ్చని, భవిష్యత్తులో మాత్రం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఆగస్టు 15 తర్వాత రుణమాఫీ చేస్తానని సీఎం మాట్లాడుతున్నారని, ఏ సంవత్సరం ఆగస్టులో చేస్తారో స్పష్టంగా చెప్పాలని నిలదీశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా తాను ప్రకటించి విషయాన్ని తన పాలనలో రుజువు చేశానని తెలిపారు. తాను 16 రోజులపాటు చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు చూపిన ఆదరణ మరువలేనిదని పేర్కొన్నారు.
రైతుబంధుకు ఎగనామం పెట్టే కుట్ర
రాష్ట్రంలో రైతులు ఇబ్బందుల పడుకుం డా తాము రైతుబంధు పథకం తీసుకొచ్చి ఏటా రూ.10 వేల నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి ఆదుకొంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు రైతుబంధు ఇవ్వకుండా ఆంక్షలు పెట్టేందుకు కుట్రలు చేస్తుందని కేసీఆర్ విమర్శించారు. రైతుబంధు రూ.15 వేలు ఇస్తామన్న వాగ్దానాన్ని ఇప్పటివరకు ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. ధాన్యానికి ఇస్తామన్న రూ.౫౦౦ బోన స్ ఏమైందని ప్రశ్నించారు. అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎప్పుడు కొంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
కరెంటు కోతలతో వరిపంట పూర్తిగా ఎండిపోయిందని, వేలమంది నష్టపోయారని, వారిని ఆదుకోవాలని సూచించారు. చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు చెల్లించకుండా మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ కార్మికులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాల్లో సర్పంచులకు బకాయిలు చెల్లించకపోవటంతో గ్రామ పాలన కుంటుపడిందని ఆవేదన వ్యక్తంచేశారు. గొర్రెలకోసం బ్యాంకులో డీడీల రూపంలో రూ.47 వేలు చెల్లించినవారికి కూడా ప్రభుత్వం గొర్రెలు ఇవ్వకుండా, డీడీలు వాపస్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.
బీజేపీ ఎజెండాలో పేదల ఊసేలేదు
దేశానికి ఏదో ఒరగబెట్టామని చొక్కా చించుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదని కేసీఆర్ విమర్శించారు. బీజేపీ మ్యానిఫెస్టోలో పేదల కోసం ఒక్క పథకం కూడా ప్రకటించలేదని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ మరోసారి అడ్డదారుల్లో ప్రధాని కూర్చీలో కూర్చునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 200లకు మించి సీట్లు రావని, తెలంగాణలో ఒకటి వస్తుందని లేకుంటే అసలే రావని తేల్చి చెప్పారు. దక్షిణాదిలో 130 ఎంపీ సీట్లుంటే కమలం పార్టీకి 10కి మించి రావని జోస్యం చెప్పారు.
బీఆర్‌ఎస్ 12 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తుందని, కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. బీజేపీ నాయకులు అధికారం మాదేనంటూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తాను మోదీకి బలంగా కనిపించడంతో ఎప్పటికైనా తనను ఇబ్బంది పెడుతారని గమనించి లిక్కర్ కేసులో క్రేజీవాల్‌ను, ఎమ్మెల్సీ కవిత అరెస్టు చేసి ఆనందపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
ఫిరాయింపుదారులు పొద్దు తిరుగుడు పువ్వులు
ఒక పార్టీలో గెలిచి మరోపార్టీకి వెళ్తూ నేటి రాజకీయ నాయకులు పొద్దు తిరుగుడు పువ్వులా మారుతున్నారని, రాజకీయ అవసరాల కోసం ఎంతటికైనా తెగబడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జంప్ జిలానీ సంస్కృతి మోదీ ప్రధాని అయిన తర్వాత పెరిగిపోయిందని విమర్శించారు. కేసీఆర్ అంటే తెలంగాణ ఎమోషన్ అని పేర్కొన్నారు. ఆ బంధాన్ని తుడిచేస్తాం అన్నవాళ్ల పిచ్చోళ్లని, తన చరిత్ర చెరిపివేయడం ఎవరి తరం కాదని స్పష్టంచేశారు. ‘బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ మారే ప్రసక్తిలేదు.
మారాలి అనుకున్నవారు కాంగ్రెస్ పంచన చేరారు. వారికి ఈ ఎన్నికల్లో తగిన శాస్తి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ నాయకులకు టచ్‌లో ఉన్నారు. రేవంత్‌రెడ్డి కింద ఉండలేమని, మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే గులాబీ కండువా కప్పుకుంటామని చెప్పారు’ అని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెజార్టీ సీట్లు గెలిచి కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.