calender_icon.png 29 October, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎప్‌సెట్ బైపీసీ అభ్యర్థులకు సీట్లు

29-10-2024 12:59:57 AM

మొదటి విడతలో 10,436 సీట్లు భర్తీ

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణలో టీజీఎప్‌సెట్ బైపీసీ అభ్యర్థులకు మొదటి విడత సీట్లను సోమవారం కేటాయించారు. బీఫార్మసీ, ఫార్మా-డీ, బయోమెడికల్, బయోటెక్నాలజీ, ఫార్మా స్యూటికల్ ఇంజినీరింగ్‌లో సీట్లను భర్తీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 210 కాలేజీల్లో సీట్లని మొదటి విడతలో భర్తీ చేశారు.

మొత్తం 10,854 సీట్లలో 10,436 సీట్లు మొదటి విడతలో భర్తీఅయ్యాయి. అన్ని కోర్సులు కలిపి 96.1 శాతం సీట్లు నిండగా, ఇంకా 418 సీట్లు మాత్రమే మిగిలాయి. కొన్ని బ్రాంచీల్లో సీట్లు వందకు వంద శాతం నిండడం గమనార్హం. రాష్ట్రంలోని 127 బీఫార్మసీ కాలేజీల్లో 8,845 సీట్లలో 8,453 సీట్లు (95.6 శాతం) కేటాయించగా, ఇంకా 392 సీట్లు మిగిలాయి.

8 యూనివర్సిటీ కాలేజీలు, ఒకటి ప్రభుత్వ కాలేజీల్లో వంద శాతం సీట్లు నిండగా, 118 ప్రైవేట్ కాలేజీల్లో మాత్రం 95.3 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మాడీ కోర్సు అందించే 74 కాలేజీల్లో 1,648 సీట్లకుగానూ 1,627 (98.7 శాతం) సీట్లను విద్యార్థులకు కేటాయించారు. ఇంకా 21 సీట్లు మాత్రమే మిగిలాయి. ఫార్మాడీ కోర్సును అందించేవాటిలో మొత్తం ప్రైవేట్ కాలేజీలే ఉన్నాయి.

బయో టెక్నాలజీ, బయో మెడికల్‌లో వందశాతం సీట్లు ఫిల్  

బయోమెడికల్ ఇంజినీరింగ్ కోర్సు అందించే రెండు కాలేజీల్లో ఒకటి యూనివర్సిటీ             కాలేజీకాగా, మరొకటి ప్రైవేట్ కాలేజీ ఉంది. ఈ రెండు కాలేజీల్లో కలిపి 58 సీట్లకుగానూ, 58 సీట్లు (100 శాతం) నిండాయి. ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సు అందించే కాలేజీలు రాష్ట్రంలో మూడు ఉన్నాయి. వీటిలో 122 సీట్లకు 117 (95.9 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి.

ఈ కోర్సులో కేవలం ఐదు సీట్లు మాత్రమే మిగిలాయి. రాష్ట్రంలో బయోటెక్నాలజీ కోర్సు అందించే వాటిలో ఒకటి యూని వర్సిటీ కాలేజీ ఉండగా, మరో 3 ప్రైవేట్ కాలేజీలున్నాయి. యూనివర్సిటీ కాలేజీలో 38 సీట్లకు 38 (100 శాతం) నిండాయి. మిగిలిన మూడు ప్రైవేట్ కాలేజీల్లోనూ 143 సీట్లుంటే మొత్తం భర్తీ అయ్యాయి. ఈ కోర్సులో 181 సీట్లకు 181 సీట్లు నిండాయి. 

అన్నీ కోర్సుల్లో కలిపి ఈడబ్ల్యూఎస్ కోటాలో 498 సీట్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. 54 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈనెల 30వ తేదీ వరకు సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించి రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. మొదటి విడతలో మిగిలిన సీట్లకు నవంబర్ 11 నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.