మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు
పాట్నా, డిసెంబర్ 27: కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమలశాఖ మంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు (రామ్‌విలాస్) చిరాగ్ పాశ్వాన్ అనుచరుడు హులాస్ పాండే అక్రమాస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. శుక్రవారం ఏకకాలంలో ఈడీ బృందాలు పాట్నా, ఢిల్లీ, బెంగళూరులోని ఆయన నివాసాలను సోదా చేశాయి. బిహార్‌లో ఇసుక మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసును ఈడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నది.
దందాతో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న నేతల ఇళ్లలో ముమ్మర సోదాలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగానే తాజాగా హులాస్ పాండేకు సంబంధించిన ఆస్తులపై నిఘా పెట్టాయి. 2012లో సంచలనం సృష్టించిన ప్రవేటు మిలీషియా రణవీర్ సేన వ్యవస్థాపకుడు బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా హత్యకేసులో ప్రధాన సూత్రధారిగా సీబీఐ హులాస్ పాండేను ఛార్జిషేట్‌లో పేర్కొన్నది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ 2023 లో పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. సీబీఐ ఛార్జిషీట్‌ను ఏప్రిల్‌లో న్యాయస్థానం కొట్టివేయడంతో పాండేకు ఆ కేసు నుంచి విముక్తి లభించింది. పాండే గతంలో జనతాదళ్ (యూనైటెడ్) పార్టీలోనూ కీలకంగా పనిచేశారు.