- రూ. కోటి నగదుతో పాటు ఐదు కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- వివరాలను వెల్లడించిన ఈడీ అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో రూ.300 కోట్ల నిధుల గోల్‌మాల్‌కు సంబంధించిన కేసులో ఈడీ (ఎన్‌ఫో ర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు ఏడు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. మహేష్ బ్యాంకు ఉద్యోగులు కుమ్మక్కై భారీ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేల్చారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అసలు విషయాలు మరిన్ని బయటపడే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుకు సంబంధించిన నిధులను భారీగా దారి మళ్లించినట్లు అధికారు లు గుర్తించారు. ఈడీ అధికారులు మహేష్ బ్యాంకులో సోదాలకు సంబంధించిన వివరాలను గురువారం వెల్లడించారు.
వెలుగు చూసిన భారీ అక్రమాలు..
హైదరాబాద్‌లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో భారీ అక్రమాలు జరిగాయని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకు చైర్మన్ రమేశ్‌కుమార్ బంగ్, ఉమేష్ చంద్ అవాసా, ఎండీ పురుషోత్తం దాస్ మంధానతో పాటు సీఈవో, డైరెక్టర్లపై బంజారా హిల్స్ పీఎస్‌లో నమోదు చేసిన కేసు ఆధారంగా రెండు రోజుల బ్యాంకుతో పాటు వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసినట్లు తెలిపారు. ఈ సోదాల్లో రూ. కోటి నగదుతో పాటు రూ. 5 కోట్ల విలువైన ఆభరణాలు, విదేశీ కరెన్సీ, ఆస్తి పత్రాలు, బ్యాంకు లాకర్ తాళాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేశారని, వక్ఫ్‌బోర్డుకు చెందిన పలు ఆస్తులకు సైతం రుణాలు ఇచ్చారని ఈడీ పేర్కొంది.
బ్యాంకు హెడ్ ఆఫీస్ నిర్మాణంలో రూ. 18.3 కోట్ల అక్రమాలకు పాల్ప డ్డారని, అలాగే అనర్హులకు 10 శాతం కమిషన్ తీసుకుని రూ. 300 కోట్ల రుణాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. 1800 మందికి నకిలీ బంగారు రుణాలు ఇచ్చినట్లు తమ సోదాల్లో తేలిందని, రుణ గ్రహీతలను సభ్యులుగా చేర్చుకుని వారికి అనుకూలంగా ఓట్లు పొందడం వంటివి చేశారన్నారు. బ్యాంకు నిర్వహణ వంటి వాటి కోసం తప్పు డు బిల్లులతో రూ. 6.5 కోట్లు తీసుకున్నట్లు తేల్చారు. పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు, ఆ రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబ సభ్యులే తీసుకున్నారని తెలిపారు.
తక్కువ ధరతో ఆస్తుల కొనుగోలు
రుణాల మంజూరు, రుణాల ఖాతాల నిర్వహణ, వాటి మూసివేతలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఈడీ విచారణలో తేలింది. నిందితులు వారి కుటుంబ సభ్యులు ప్రస్తుత మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ ధరతో ఆస్తులు సంపాదించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. రుణం పొందిన వారి ఖాతాల నుంచి నిందితులు, వారి కుటుంబ సభ్యులకు తిరిగి పంపించారని, కొలాటరల్ సెక్యూరిటీలుగా తాకట్టు పెట్టిన ఆస్తులు కూడా నిందితులు, వారి కుటుంబసభ్యులు తక్కు వ ధరలకు సంపాదించినట్లు గుర్తించారు. విచారణ కొనసాగిస్తున్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. బ్యాంకులోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని ఈడీ తెలిపింది.