22-02-2025 01:44:02 AM
కరీంనగర్, ఫిబ్రవరి21(విజయక్రాంతి): మెదక్ -నిజామాబాద్ -కరీంనగర్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ పేపర్ల పరిశీలన కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బ్యాలెట్ పేపర్ పరిశీలనలో పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి బ్యాలెట్ పేపర్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఏదైనా బ్యాలెట్ పేపర్లు రిమార్కులు ఉంటే నిర్ణీత ఫారం పూరించాలని, ఆ బ్యాలెట్ పేపర్ వరుస సంఖ్య నమోదు చేయాలని తెలిపారు.
ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ప్రతి బ్యాలెట్ పేపర్ను అభ్యర్థుల సమక్షంలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యాలెట్ పేపర్ల పై ఉన్న వరుస సంఖ్య, ఫోటోలు, అభ్యర్థుల పేర్లు తదితర వివరాలను సరిచూశారు. అభ్యర్థులు, అభ్యర్థుల తరఫున వచ్చిన ఏజెంట్లు బ్యాలెట్ పేపర్ల తనిఖీని పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.