calender_icon.png 25 October, 2024 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ నిర్ధారణకు స్క్రీనింగ్ సెంటర్లు

25-10-2024 12:17:27 AM

  1. ప్రతి జిల్లాలో ఏర్పాటుకు ప్రభుత్వం యోచన
  2. మంత్రి దామోదర రాజనర్సింహ
  3. మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్‌రావుతో కలిసి మెదక్ మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభం

మెదక్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): క్యాన్సర్ నివారణలో భాగంగా ఐదు క్యాన్సర్ సెక్టార్లను ఏర్పాటు చేసి మెహదీ నవాజ్‌జంగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ(ఎంఎన్‌జేఐఓ) హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

మెదక్ మెడికల్ కళాశాలలో గురువారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రమాదకరమైన క్యాన్సర్ నిర్ధారణ కోసం ప్రతి జిల్లాలో మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుందన్నారు.

డయాబెటిస్, క్యాన్సర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 74 ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో, మండల స్థాయిలో వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు మెదక్ మెడికల్ కళాశాలలో 220 పడకల విస్తరణతో పాటు వచ్చే ఏడాది కళాశాలలో పారామెడికల్, నర్సింగ్ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, చిట్టి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ టీ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ప్రిన్సిపాల్ రవికుమార్, డాక్టర్ శివదయాల్ తదితరులు పాల్గొన్నారు. 

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయమని మంత్రి రాజనర్సింహ అన్నారు.  వైద్యం, వ్యవసాయం, జిల్లా గ్రామీణాభివృద్ధి, మార్కెటిం గ్ సంబంధిత అధికారులతో మెదక్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ ద్వారా సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీకి సంబంధించి ఎంతమంది రైతులు లబ్ధి పొందారు..

ఇంకా ఎవరెవరికి రుణమాఫీ చేయాల్సి ఉందనే విషయాలపై జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌ను అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ శాఖ ద్వారా పత్తి కొనుగోలు సక్రమంగా నడుస్తుందా అనే విషయాలను అడిగారు. జిల్లా జనసాంద్రత ఆధారంగా కొత్త ఆరోగ్య ఉప కేంద్రాలకు ప్రతిపాదనలు పెట్టాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు.  

పీహెచ్‌సీ భవనం ప్రారంభం

సంగారెడ్డి: పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్‌లో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

దౌల్తాబాద్ పీహెచ్‌సీని 30 పడకల దవాఖానగా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి, నర్సపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా వైద్యాధికారి గాయత్రి, ఆర్డీవో రాజు, తహసీల్దార్ ఫరీనా షేక్, డాక్టర్ దివ్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు.