calender_icon.png 20 November, 2024 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదిహేనేండ్లు దాటితే స్క్రాప్‌కే

20-11-2024 03:33:13 AM

ఎలక్ట్రానిక్  వాహనాలకు మారాలె

రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్ టాక్సులు తీసుకోం

హైబ్రిడ్ వాహనాలకు కూడా పన్ను రాయితీ 

రాష్ట్రంలో మరో ఐదు సెట్విన్ ట్రైనింగ్ సెంటర్లు

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, నవంబర్ 19: పదిహేనేండ్లు దాటిన వెహికిల్స్‌ను స్వచ్ఛందంగా స్క్రాప్‌కు పంపాల్సిందేనని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వాహనాల స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిందని, దానిని అమలు చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బుడిగజంగాల కాలనీలో ఇందిరమ్మ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మున్సిపల్ కాంప్లెక్స్‌లో సెట్విన్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం విశాల పరపతి సహకార సంఘం ఆఫీస్ బిల్డింగ్, గోదాంతోపాటు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాం తారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోవడంతో అక్కడ స్కూళ్లను బంద్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

ఇందుకోసం ఈవీ పాలసీని తీసుకొచ్చామన్నారు. పదిహేనేండ్లు దాటిన వాహనాలను స్క్రాప్‌కు వేయాల్సిందేనని, దీనిపై రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కఠినంగా వ్యవహరించి కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. ఈవీలను వాడుతూ కాలుష్యాన్ని తగ్గించుకుందామని పిలుపునిచ్చారు. ఈ వెహికిల్స్‌పై రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్డు టాక్సులు పూర్తిగా రద్దు చేశామని పేర్కొన్నారు. దీంతో ఒక్కరోజులోనే 113 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలిపారు. అంతకుముందు రోజుకు ఐదు వాహనాలు కూడా రిజిస్ట్రేషన్ కాలేదన్నారు. హైబ్రిడ్ వాహనాలపై కూడా పన్ను రాయితీ కల్పించే ఆలోచనలో ఉన్నామన్నారు.

పారిశ్రామిక కేంద్రంగా చౌటపల్లి

అక్కన్నపేట మండలం చౌటపల్లిలో పరిశ్రమలను ఏర్పాటు చేసి ఆ ప్రాం తాన్ని పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామని మంత్రి పొన్నం అన్నారు. అక్కడ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లతోపాటు రైస్‌మిల్లులు, వ్యవసాయ అను బంధ పరిశ్రమలను నెలకొల్పుతామని చెప్పా రు. ఇందుకోసం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారని తెలిపారు. బలవంతంగా భూములు లాక్కోబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.2 లక్షల లోపు ఉన్న రైతుల లోన్లను మాఫీ చేశామన్నారు.
ఇప్పటివరకు 110 కోట్ల మంది మహిళలు రూ.3,700 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో మరో ఐదు సెట్విన్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో 19 ఉన్నాయని, జహీరాబాద్, హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా మహిళలు, నిరుద్యోగులకు వివిధ అంశాల్లో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. టాంకాం కంపెనీ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్‌రోల్‌మెంట్ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా ప్రజలు ఎవరినైనా స్వేచ్ఛగా కలవొచ్చని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, ములుకనూరు సహకార బ్యాంకు చైర్మన్ ప్రవీణ్‌రెడ్డి, కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య పాల్గొన్నారు.