షోరూం ముందే తగలబెట్టి నిరసన
చెన్నై, నవంబర్ 29: తమిళనాడుకు చెందిన పార్థసారథి అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం కొనుగోలు చేసిన తన ఎలక్ట్రిక్ స్కూటీని షోరూం ముందే తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకోగా ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పోలీసుల వివరాల ప్రకారం తిరుముల్లువాలయ్ ప్రాంతానికి చెందిన పార్థసారథి రూ.1.80లక్షలు ఖర్చు చేసి, చెన్నైలోని అంబత్తూర్లో ఉన్న షోరూంలో ఆథర్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినప్పటి నుంచి స్కూటీలో ఏదో ఒక సమస్య ఉత్పన్నం అవుతూనే ఉంది. ఈ క్రమంలో పలుమార్లు ఆయన షోరూంను సందర్శించి స్కూటీకి రిపేర్ చేయించారు.
తాజాగా మరోసారి సమస్య తలెత్తడంతో స్కూటీని షూరూంకు తీసుకెళ్లారు. అయితే అక్కడి సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో విసుగు చెందారు. ఈ నేపథ్యంలోనే షోరూం ఆవరణలోనే నిప్పంటించి నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగాట్రాఫిక్ జామ్ అయింది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో షోరూం సిబ్బందిపై పార్థసారథి ఫిర్యాదు చేశారు. మరోవైపు షోరూం సిబ్బంది సైతం మంటల్లో పాక్షికంగా ధ్వంసమైన స్కూటీని స్వాధీనం చేసుకుని సమస్యను పరిష్కరిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు.