- చట్టానికి సవరణలపై క్యాబినెట్ భేటీలో చర్చ
- 40 నిబంధనలు మార్చాలని ప్రతిపాదన
- వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
- బోర్డులో మహిళలకూ చోటు?
న్యూఢిల్లీ, ఆగస్టు 4: వక్ఫ్ బోర్డ్ ఆస్తులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఆస్తులపై వక్ఫ్ బోర్డ్‌కు ఉన్న అపరిమిత అధికారాలను కేంద్రం తన నియంత్రణలోకి తీసుకోవాలని భావిస్తోంది. వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చేయాలని శుక్రవారం భేటీలో క్యాబినెట్ చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
బోర్డులో మహిళలకు కూడా చోటు కల్పించేలా సవరణలు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. వక్ఫ్ బోర్డుకు దేశవ్యాప్తంగా లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. వీటన్నింటిని వక్ఫ్ బోర్డ్ నియంత్రణలో నుంచి స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
క్యాబినెట్‌లో ప్రతిపాదించిన సవరణల ప్రకారం గతంలో అపరిమితంగా వక్ఫ్ బోర్డులు తమవి అని చెప్పిన ఆస్తులపై తప్పనిసరిగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. వక్ఫ్ బోర్డులు, వ్యక్తిగత యజమానులు చేసిన క్లెయిమ్‌లు, కౌంటర్ క్లెయిమ్‌లు చేసిన ఆస్తులను ఇదే విధంగా ధ్రువీకరించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెండు ప్రధాన సవరణలు
వక్ఫ్ బోర్డుల ఏకపక్ష అధికారాలు, ఆస్తుల ధ్రువీకరణ నిబంధనలు చట్టానికి ప్రధాన సవరణలని సమాచారం. ప్రస్తుతం ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేసే అధికారం ఆ సంస్థకు ఉంది. దేశవ్యాప్తంగా 8.7 లక్షల కోట్లకు పైగా ఆస్తులు, మొత్తం 9.4 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయి.
ముస్లిం మేధావులు, మహిళలు, షియా, బోహ్రాస్ వంటి వర్గాల నుంచి చట్టంలో మార్పులను కోరుతూ అనేక ప్రతిపాదనలు వచ్చాయి. 2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో వక్ఫ్ చట్టానికి సవరణ చేయడం ద్వారా వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలు కల్పించారు.
వక్ఫ్ బోర్డుల కూర్పులో మార్పులను కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తుందని, ప్రస్తుత చట్టంలోని కొన్ని నిబంధనలను కూడా రద్దు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. వక్ఫ్ చట్టం ప్రకారం ఔకాఫ్ (విరాళంగా వచ్చిన ఆస్తులు, వక్ఫ్ గుర్తించినవి)ను వకీఫ్ ద్వారా నియంత్రించడానికి రూపొందించారు. అప్పీల్ ప్రక్రియలో లోపాలను కూడా సవరించాలని చర్చించినట్లు సమాచారం.
వక్ఫ్ ఆస్తులను లాక్కునే కుట్ర: ఒవైసీ
వక్ఫ్ చట్టానికి సవరణలకు బిల్లు తీసుకువస్తుండటంపై మజ్లిస్ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తన హిందుత్వా అజెండా, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో వక్ఫ్ బోర్డు ఆస్తులను లాక్కునే కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
ఈ సవరణలతో బోర్డు స్వయంప్రతిపత్తి కోల్పోతుందని, సంస్థ పరిపాలనలో గందరగోళం సృష్టిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం మత స్వాతంత్య్రానికి వ్యతిరేకమన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో బిల్లుపై లీకులివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.