calender_icon.png 24 October, 2024 | 3:46 AM

విలీనం దిశగా బడులు!

24-10-2024 02:09:21 AM

  1. తక్కువ ఎన్‌రోల్‌మెంట్ ఉన్న బడులను సమీప స్కూళ్లల్లో కలిపే యోచన
  2. వచ్చే అకడమిక్‌కు సిఫార్సులు చేసేదిశగా విద్యా కమిషన్ కసరత్తు
  3. మండలాల్లో అన్ని వసతులతో కూడిన స్కూళ్ల ఏర్పాటుకు ఆలోచన
  4. స్టూడెంట్స్‌కు బస్సు సౌకర్యం కల్పించాలని భావిస్తున్న కమిషన్

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇతర పాఠశాలల్లో విలీనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్‌రోల్‌మెంట్ తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సమీప పాఠశాలల్లో కలిపే దిశగా కసరత్తులు జరుగుతున్నాయి.

ఒకవైపేమో సీఎం రేవంత్‌రెడ్డి.. ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలను మూసివేయబోమని, ప్రతీ గ్రామంలో, తండాలో కచ్చితంగా పాఠశాల ఉండాలని చెబుతుంటే.. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యాశాఖ కమిషన్ మాత్రం పిల్లలు తక్కువగా ఉన్న పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేసి, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొనేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని విద్యాకమిషన్ చైర్మన్‌గా నియమించడంతోపాటు, ముగ్గురు సభ్యులు, ఆరుగురితో ఓ సలహామండలిని ప్రభుత్వం ఇటీవల నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే దిశగా విద్యా కమిషన్ నివేదిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఇందుకు విద్యాకమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, గురుకులాల్లో అందుతున్న విద్య, వసతుల కల్పన, సమస్యలపై నివేదిక రూపొందిస్తున్నారు.

విద్యార్థులు తక్కువగా ఉండే స్కూళ్లు విలీనం..

కొన్నిచోట్ల విద్యార్థులుంటే టీచర్లు లేరు. మరికొన్ని చోట్ల టీచర్లుంటే విద్యార్థులు లేరు. అధికారులేమో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 10 లోపు ఉందని చెబుతున్నారు. కానీ, కొన్ని పాఠశాలల్లో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొన్నిచోట్ల కిలోమీటర్ పరిధిలో మూడు నాలుగు స్కూళ్లు ఉంటున్నాయి. ఒక పాఠశాలలో విద్యార్థులు ఉంటే, మరో పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉంటున్నారు.

అక్కడ, ఇక్కడ టీచర్లు ఉంటున్నారు. దీంతో ఈ తరహా స్కూళ్లను ఒకదాంట్లో ఒకటి విలీనం చేయడం ద్వారా విద్యార్థులు సంఖ్య పెరగడంతోపాటు అక్కడి టీచర్లను ఈ పాఠశాలలకు అటాచ్ చేయడం ద్వారా టీచర్ల కొరత తగ్గే అవకాశం ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలో లేదా ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని కమిషన్ భావిస్తోంది. ప్రతీ తరగతికి ఒక టీచర్ ఉండేలా విద్యాకమిషన్ రిపోర్ట్ రెడీ చేసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.

ప్రభుత్వ స్కూళ్లకు బస్సు సౌకర్యం?

రాష్ట్రంలో దాదాపు 632 మండలాలున్నాయి. ఒక్కో మండలంలో ఎనిమిది, పది, ఆపైన గ్రామాలున్నాయి. అయితే ఆయా మండలంలోని ఎన్‌రోల్‌మెంట్ తక్కువగా ఉండే స్కూళ్ల స్థానంలో అన్ని వసతులతో కూడిన సెమిరెసిడెన్షియల్ లేదా రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలని విద్యాకమిషన్ భావిస్తోంది.

మండలానికి మూడు నుంచి నాలుగు స్కూళ్లను ఏర్పాటు చేసి ప్రీప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రభుత్వమే బస్సు సౌకర్యాన్ని కల్పించేలా కసరత్తు చేస్తున్నారు. ఒక తరగతికి కచ్చితంగా ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే విలీనం తర్వాత ఆయా పాఠశాలల్లోని టీచర్లు, సిబ్బందిని సైతం సర్దుబాటు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

100 దాటి విద్యార్థులున్న స్కూళ్లు 5,367 మాత్రమే..

రాష్ట్రంలో 26,287 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అయితే ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు 1,864 ఉన్నాయి. 5,367 పాఠశాలల్లో మాత్రమే 100 మందికిపైగా విద్యార్థులున్నారు. గత విద్యాసంవత్సరం 2023 ఒక్క విద్యార్థిలేని పాఠశాలలు 1213 కాగా, ఈ విద్యాసంవత్సరంలో విద్యాశాఖ తెలిపిన వివరాల ప్రకారం 1,864 ఉన్నాయి.

ఈ ఏడాది జూన్‌లో కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన రాష్ట్రాల సమావేశంలో 50 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లను విలీనం చేయాలని ఆదేశించింది. ఇదే క్రమంలో ఇటు విద్యాశాఖ కమిషన్ కూడా విలీనానికి అడుగులు వేస్తుండటం గమనార్హం.

విద్యార్థుల సంఖ్య బడుల వివరాలు..

* సున్నా విద్యార్థులున్న స్కూళ్లు 1,864

* ఒకరు నుంచి 30 మంది  9,447

* 31 నుంచి 100 మంది  9,609

* 101 నుంచి 250 మంది 3,947

* 251 నుంచి 500 మంది 1,063

* 501 నుంచి 750 వరకు 272

* 750 మందికి పైగా విద్యార్థులున్న స్కూళ్లు 85