calender_icon.png 20 October, 2024 | 3:08 AM

మంత్రిగారి ఇలాకాలో బడి దొంగలు!

20-10-2024 12:16:37 AM

  1. పుష్కర కాలంగా పాఠశాలకు వెళ్లని టీచర్లు!
  2.  వారిచే కొత్త పంతుళ్లకు నియామక పత్రాలు
  3.  కందనూలు విద్యాశాఖలో వింతపోకడలు
  4. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఇళాకాలోని కొల్లాపూర్ ప్రాంతంలో టీచర్లు బడికి వెళ్లకుండా పైరవీలతో కాలం వెళ్లదీస్తున్నారు. రియల్‌ఎస్టేట్, చిట్టీల వ్యాపారాలు చేస్తూ బిజీగా గడుపుతూ బడికి డుమ్మాలు కొడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొందరు పంతుళ్లు కనీసం ఒక్కరోజు కూడా విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా పైరవీలతోనే పబ్బం గడుపుతున్నారన్న విమర్శలున్నాయి. కొందరు ఉపాధ్యాయులు ఉన్నతాధికారుల అండతో ఆన్‌డ్యూటీ పేరుతో పలు ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో పైరవీలు, వసూళ్లకు తిరుగుతున్నారని ఇతర ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

తమ పాఠశాలలో పనిచేయాల్సిన సోషల్ టీచర్ వెంకటశెట్టి పాఠశాల ప్రారంభం నుంచి హాజరు కావడంలేదని విద్యార్థులు మండిపడుతున్నారు. 

నాగర్‌కర్నూల్ జిల్లాలో 2000 సంవతర్సరం డీఎస్సీలో ఉద్యోగాన్ని సంపాదించిన ఓ పంతులు సాధారణ బదిలీల్లో భాగంగా ఇప్పటిదాకా నాలుగు పాఠశాలలు మారినా ఒక్క విద్యార్థికి కూడా పాఠం చెప్పిన దాఖలాలు లేవని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు.

మండల రిసోర్సు సెంటరు (ఎంఆర్సీ)లో స్ట్రాంగ్ టీచర్‌గా పనిచేస్తూ అప్పట్లోనే కొన్ని పాఠశాలలను తన గుప్పిట పెట్టుకుని అజమాయిషీ చేసేవాడని కొందరు ఉపాధ్యాయులు చెప్పుకోవడం విశేషం. ఎంఆర్సీ వ్యవస్థను 2012 తొలగిస్తూ క్లస్టర్ రిసోర్స్ పర్సన్(సీఆర్పీ)లను రూ.12వేల వేతనంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

కానీ ఎలాంటి ఆర్డర్ లేకుండానే పుష్కరకాలంగా ఎలాంటి సంతకాలు కూడా లేకుండా సదరు ఉద్యోగికి స్ట్రాంగ్‌టీచర్‌గా వేతనం ఎలా ఇచ్చారన్న ప్రశ్నలకు విద్యాశాఖ అధికారులకు అంతుపట్టని విషయం. తాజాగా గత ఆగస్టులో జరిగిన బదిలీల్లో ఎస్‌జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ కల్పించడం విశేషం. అయినా నేటికీ ఒక్కరోజుకూడా విద్యార్థులకు పాఠాలు బోధించలేదని విద్యార్థులు మండిపడుతున్నారు. 

నూతన టీచర్లకు నియామక పత్రాలు..

ఉద్యోగం సాధించిన నాటి నుంచి ఏనాడూ పాఠశాలకు వెళ్లని స్కూల్ అసిస్టెంట్ వెంకట శెట్టి చేత నూతన డీఎస్సీ ద్వారా ఉద్యోగాన్ని సాధించిన కొత్త పంతుళ్లకు నియామక పత్రాలు అందజేయడం పలు విమర్శలకు తావిస్తోంది.

ఏకంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, డీఈవో గోవిందరాజులు పక్కనే ఒక స్కూల్ అసిస్టెంట్ డీఎస్సీ అభ్యర్థుల పత్రాలను వెరిఫికేషన్ చేయడం ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. జటప్రోలులో విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన టీచర్ ఆన్‌డ్యూటీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా డీఎస్సీ అభ్యర్థుల పత్రాల పరిశీలనకు ఉంచడంపట్ల విద్యాశాఖతీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.