calender_icon.png 13 February, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థిని ప్రాణం తీసిన స్కూల్ ఫీజు

13-02-2025 12:00:00 AM

  1. ఫీజు కోసం వేధించడంతో  ఆత్మహత్యాయత్నం
  2. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 
  3. మేడ్చల్‌లో విషాదఛాయలు 

మేడ్చల్, ఫిబ్రవరి 13(విజయ క్రాంతి): ఫీజు చెల్లించాలని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం వేధించడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అఖిల (16) ను ఫీజు చెల్లించాలని యాజమాన్యం తరచూ ఒత్తిడి చూడడమే కాక, ఇటీవల తల్లిదండ్రుల సమావేశానికి అఖిలను పిలిచి అందరి ముందు ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ రమాదేవి గట్టిగా మందలించడంతో విద్యార్థిని మనస్థాపానికి గురైంది.

సోమవారం పాఠశాలకు వెళ్లలేదు. మంగళవారం ఉదయం బెడ్ రూమ్ తలుపులు వేసుకొని ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఎంతకు తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యానుకు వేలాడుతోంది.

వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల వరకు ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మరణించింది.

ఇద్దరి ఫీజు రూ. 80 వేలు బకాయి 

ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు, కమల దంపతులు ఉపాధి నిమిత్తం మేడ్చల్ కు వలస వచ్చారు. వెంకటేశ్వరరావు ఒక ఆసుపత్రిలో పనిచేస్తుండగా, కమల ఇటీవల వరకు మరో ఆసుపత్రిలో పనిచేసేది. వీరి కూతురు అఖిల, కుమారుడు విక్రమ్ శ్రీ చైతన్య పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు. విక్రమ్ డిప్రెషన్ కు గురి కావడంతో కొన్ని రోజులుగా స్కూలుకు వెళ్లడం లేదు.

ఇద్దరి ఫీజు రూ. 80 వేలు చెల్లించాల్సి ఉంది. తాము చెల్లిస్తామని చెప్పిన తమ కూతురిని వేధించారని తల్లి కమల తెలిపారు. కమల యశోద ఆసుపత్రి నుంచి బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చింది. ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కూతురుని వేధించే హక్కు ఎవరిచ్చారు అని ప్రశ్నించింది. తమ కూతురిని ఎలాగైనా బతికించాలని అక్కడివారిని వేడుకుంది. 

ఫీజు కోసం వేధించలేదు 

తాము ఫీజు కోసం విద్యార్థి అఖిలను వేధించలేదని ప్రిన్సిపాల్ రమాదేవి, రీజనల్ ఇన్చార్జి చక్రి తెలిపారు. గత సంవత్సరం ఫీజు నవంబర్లో చెల్లించారని తెలిపారు. వేధించే వారిమైతే గత సంవత్సరం ఫీజు కోసం నవంబర్ వరకు ఎలా ఆగుతామన్నారు.